వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజుల క్రితం రామోజీ సిటీకి వెళ్లి తన బద్ధ శత్రువయిన రామోజీరావుని కలవడం ఒక సంచలన వార్త అయ్యింది. మళ్ళీ మొన్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బద్ద శత్రువైన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడం, అందుకు ఆయన అంగీకరించడం సంచలనం సృష్టించింది. మళ్ళీ నిన్న చంద్రబాబు నాయుడు స్వయంగా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి రామోజీరావుని ఆహ్వానించడం కూడా అందరిలో ఆసక్తి రేకెత్తించింది.
ఈ మూడు భేటీలలో చంద్రబాబు నాయుడు వెళ్లి కేసీఆర్, రామోజీలను ఆహ్వానించడం గురించి మిగిలిన అన్ని మీడియాలతో సహా ఈనాడు, సాక్షి మీడియాలలో కూడా వార్తలు వచ్చేయి. జగన్ వెళ్లి రామోజీతో సమావేశం అవడం గురించి కూడా మిగిలిన అన్ని మీడియాలో చాలా వార్తలు, విశ్లేషణలు వచ్చేయి కానీ ఈనాడు, సాక్షి మీడియాలలో దాని గురించి ఒక్క ముక్క కూడా పేర్కొనబడలేదు. వారిద్దరూ కూడా తమ సమావేశ వివరాలను ఇంతవరకు బయటపెట్టలేదు.
చంద్రబాబు నాయుడు తన బద్ధశత్రువయిన కేసీఆర్ ని శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించడంపై ఎవరూ ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. పైగా అందరూ దానిని స్వాగతించారు కానీ జగన్-రామోజీల భేటీని మాత్రం మిగిలిన మీడియాతో సహా అందరూ అనుమానాలు వ్యక్తం చేసారు. అప్పుడు కూడా వారిరువురూ మౌనంగా ఉండిపోవడంతో వారి అనుమానాలను అది మరింత బలపరిచినట్లే అయ్యింది. దాని వలన రామోజీకి పెద్దగా నష్టం జరుగక పోవచ్చును. ఎందుకంటే ఆయన జగన్ లాగ ప్రత్యక్ష రాజకీయాలలో లేరు…కనుక ప్రజల నమ్మకాన్ని పొందవలసిన అవసరం లేదు. కానీ రాజకీయాలలో ఉన్న జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత ప్రశ్నార్ధకం అయ్యింది. రాజకీయాలలో ఎదగాలనుకొనే వారిపై ప్రజలలో, మీడియాలో ఇటువంటి అనుమానాలు ఏర్పడి ఉండటం ఎంత మాత్రం మేలు చేయదు.
ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు కనబరిచిన ‘స్థిత ప్రజ్ఞత’ మరింత బాగా కొట్టవచ్చినట్లు కనబడింది. తన బద్ధ శత్రువయిన జగన్మోహన్ రెడ్డితో రామోజీ సమావేశం అయ్యారనే సంగతి కూడా తనకు తెలియదన్నట్లుగా వ్యవహరిస్తూ ఆయన స్వయంగా రామోజీఫిలిం సిటీకి వెళ్లి రామోజీని అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేత ఇంటికి స్వయంగా వెళ్లి ఆహ్వానించడం చాలా విశేషమే. అది రామోజీకి ఆయనిచ్చిన అపూర్వమయిన గౌరవంగా భావించవచ్చును. తద్వారా ఆయన రామోజీకి చాలా మంచి సందేశమే ఇచ్చారని చెప్పవచ్చును. యధాప్రకారం తెదేపాకి అండగా నిలబడి అటువంటి అపూర్వమయిన గౌరవమర్యాదలు పొందడమా లేక తన ప్రత్యర్ధి అయిన జగన్మోహన్ రెడ్డితో చేతులు కలపడం మంచిదా? అని ఆలోచించుకొనే అవకాశం రామోజీకే వదిలిపెట్టారు చంద్రబాబు నాయుడు. బహుశః ఆయన అది అర్ధం చేసుకొన్నందునే ఈనాడు మీడియాలో చంద్రబాబు ఆహ్వానించిన వార్తని ప్రముఖంగా ప్రచురించారని భావించవచ్చును. అదే నిజమయితే రామోజీని కలిసినందుకు బహుశః జగన్ ఇప్పుడు పశ్చాతాపపడుతున్నారేమో? అంతే కాదు…అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి హాజరుకానని ప్రకటించి జగన్మోహన్ రెడ్డి తనను తాను, తన పార్టీని కూడా ప్రజల నుండి స్వయంగా వెలి వేసుకొని, వారిలో తమ పట్ల ఒక దురాభిప్రాయం ఏర్పడేలా చేసుకొంటే, చంద్రబాబు నాయుడు చాలా స్థిత ప్రజ్ఞత కనబరిచి అందరినీ కలుపుకొనిపోతూ తమ మధ్యలో ఉన్న తేడాని ప్రజల కళ్ళకు కట్టేలా చూపించడంలో సఫలం అయ్యారని చెప్పవచ్చును.