చంద్రబాబుకు పేరు కావాలి. చాలా గొప్ప పేరు కావాలి. చాలా గొప్ప అంటే ప్రపంచంలో ఉన్న మనుషులు అందరి కంటే తానే గొప్ప అన్న స్థాయి పేరు కావాలి….గతంలో 42 మంది ఎంపిలు ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి నేషనల్ మీడియాకు కూడా తన పేరు తెలిసేలా చేసుకోగలిగాడు. ఆ పేరుని పదింతలు ప్రచారం చేసుకుని ప్రపంచ దేశాలన్నింటా కూడా తనకు చాలా గొప్ప పేరుందని చెప్పి మా గొప్పగా ప్రచారం చేసుకున్నాడు. ఆ ప్రచారం ఒకసారికి బాగానే వర్కవుట్ అయిందని కానీ రెండో పర్యాయం మాత్రం జనాలకు మొహం మొత్తింది. అయితే మాకేంటి అని లైట్ తీసుకున్నారు. దెబ్బకు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొప్ప పేరు ఎలా తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలియలేదు. అంతకంటే కూడా అధికారం, డబ్బు, హోదాని బట్టి కదా భజన బ్యాచ్ అందరూ ఆహా…ఓహో అని కీర్తనలు అందుకునేది. అందుకే కుర్చీ దిగిపోయేసరికి పొగడ్తల వర్షం కూడా ఆగిపోయింది. పైగా విమర్శల సునామీ మాత్రం ఉవ్వెత్తున ఎగిసిపడింది. వైఎస్ జమానా నడిచినంత కాలం చంద్రబాబును తిట్టని వాళ్ళు ఎవరూ లేరేమో. ఇప్పుడు జగన్‌ని తిట్టించి చంద్రబాబు సరదా పడుతున్నట్టుగా అప్పట్లో చంద్రబాబును తిట్టించి వైఎస్ నవ్వుకుంటూ ఉండేవాడు. మిగతా వాళ్ళ తిట్ల కంటే కూడా వైఎస్ నవ్వులే చంద్రబాబుకి కంపరం తెప్పించాయి.
కట్ చేస్తే కాలం కలిసొచ్చింది. చంద్రబాబుకు మళ్ళీ ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది. పదేళ్ళపాటు దూరమైన పొగడ్తల కరువును కసిదీరా తీర్చుకోవాలనుకున్నాడు. కానీ చాలా చాలా చిన్న రాష్ట్రం, అందులోనూ లోటు బడ్టెట్ రాష్ట్రం, కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రాన్ని ఎవరు పట్టించుకుంటారు? రాష్ట్రానికే దిక్కులేనప్పుడు ఇక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు పట్టించుకుంటారు? అదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా చాలా మంది చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చేశారు. జాతీయ స్థాయి నాయకులు, జాతీయ మీడియా కూడా చంద్రబాబుకు ఆయన ఆశించిన స్థాయి ప్రాధాన్యతను ఇవ్వలేదు. కానీ తన గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలన్న చంద్రబాబు ఆత్మ ఆయనను స్థిమితంగా ఉండనివ్వలేదు. ఇక అప్పటి నుంచి ఆ ఆత్మసంతృప్తి కోసమైనా సరే…..తన భజన తానే చేసుకోవడం స్టార్ట్ చేశాడు చంద్రబాబు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు విజయం సాధించినా…..ఆ విషయంపైన మాట్లాడడం…ఫర్వాలేదనుకుంటే అది నా గొప్పే అనడం….మరీ బాగుండదేమో అనుకుంటే అందులో కూడా నా గొప్పతనం ఉంది అని పరోక్షంగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులను, ప్రజలను, మేధావులను…..ఒకరనేంటి అందరినీ కించపర్చడం స్టార్ట్ చేశాడు. అప్పుడే కదా……ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒన్ అండ్ ఓన్లీ గొప్పవాడు చంద్రబాబు అని ప్రపంచానికి తెలిసేది.
ఇప్పటికే లోకల్‌గా ఉన్న అందరూ వేస్ట్ అని తేల్చిపడేసిన చంద్రబాబు….తాజాగా ఎన్ఆర్ఐలను కూడా వేస్ట్ అని చెప్పేశాడు. గోదావరి జిల్లాల్లో ఉన్న టిడిపి నాయకులందరితో పాటు జెసిలాంటి వాళ్ళు కూడా కోడిపందాలతో సహా ఎన్నో చట్టవ్యతిరేక పనులకు పాల్పడుతుంటే….అడ్డుకోలేకపోయిన చంద్రబాబు ప్రవాస దేశీయుల గురించి మాత్రం నోరు పారేసుకున్నాడు. ఎన్ఆర్ఐలు సింగపూర్, అమెరికాలను కూడా నాశనం చేస్తారన్నట్టుగా మాట్లాడేశాడు. ఆయా దేశాల్లో రూల్స్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ఇక్కడ మాత్రం విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ రూల్స్ ఫాలో అవ్వరన్నట్టుగా మాట్లాడేశాడు. మొత్తంగా ‘తాను గొప్ప…తక్కినవాళ్ళు తక్కువ’ అని రెండున్నరేళ్ళుగా చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల శైలిలోనే ఈ మాటలు కూడా సాగాయి.
సాధించిన విజయం గురించి, చేసిన గొప్ప పనుల గురించి, మన గొప్పతనం గురించి మనమే చెప్పుకునే కాలంలో ఉన్నామా మనం? చిన్న చిన్న విజయాలు సాధించిన సామాన్యులు కూడా ఓవర్‌నైట్ సెలబ్రిటీలు అయిపోతున్న కాలం. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు జెట్ స్పీడ్‌తో వచ్చేస్తున్న కాలం. మరి ప్రపంచానికి పాఠాలు చెప్పాను అని చెప్పిన చంద్రబాబు, ఐటీని తానే కనిపెట్టాననే రేంజ్లో చెప్పుకునే చంద్రబాబు తన గురించి తానే చెప్పుకోవడం ఏంటో విడ్డూరం కాకపోతేని. అయినా దేశం వెలిగిపోతోంది అని ఊరూవాడా ప్రచారం చేసుకున్న బిజెపికి, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటూ ఊదరగొట్టిన చంద్రబాబుకు ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన విషయాన్ని అప్పుడే మర్చిపోయారా ఏంటి? సగం పాలనా కాలం అయిపోయాక కూడా ఇంకా మాటలే చెప్తూ ఉంటానంటే ఎలా చంద్రబాబూ……ప్రత్యేక హోదా, ప్యాకేజ్, రైల్వేజోన్, రాజధాని నిర్మాణం, ఆర్థిక లోటు తగ్గించడం లాంటి విషయాల్లో చేసిన పని, సాధించిన సక్సెస్ ఏంటో చెప్పు చంద్రబాబూ? ‘అగాథంలో ఆర్థికం’ అని చెప్పి బాబు గొప్పోడు, చంద్రబాబు చాలా గొప్పోడు, చంద్రబాబునాయుడు చాలా చాలా గొప్పోడు అని అహర్నిశలూ చెప్పడానికి అపసోపాలు పడుతూ ఉండే ఆంధ్రజ్యోతి పత్రికలోనే ఒక ఆర్టికల్ వచ్చింది. ఎదురుదాడి చెయ్యకుండా ఆ ఆర్టికల్‌కి సమాధానం చెప్పగలవా చంద్రబాబూ?