ఎన్డీయే పాలనలో అన్ని రాజ్యాంగబద్ధ వ్యవస్థలూ ఒక్కోటిగా నిర్వీర్యం అవుతున్నాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బెంగళూరులో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తమ భేటీలో ప్రధానంగా ఇవే అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఆర్బీఐ లాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న వ్యవస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారనీ, కేంద్రం ప్రభుత్వం కలిగిస్తున్న ఇబ్బందుల్ని ఎదుర్కొనలేకపోతున్నామంటూ ఆర్బీఐ గవర్నర్ స్వయంగా చెప్తున్నారంటేనే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు చంద్రబాబు. ఈడీ, ఆదాయ పన్ను శాఖల్ని తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్రంలోని అధికార పార్టీ వాడుకుంటోందని ఆరోపించారు.
కర్ణాటకలో ఇలాంటి పరిస్థితిని చూశామనీ, తమిళనాడు, తాజాగా తెలంగాణ విషయంలో కేంద్రం వైఖరి ఇలానే ఉంటోందన్నారు. ప్రతిపక్ష పార్టీలను బెదిరించడం కోసమే వీటిని వాడుతున్నారన్నారు. రెండేళ్ల కిందట తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇంతవరకూ ఒరిగిందేం లేదనీ, ఆర్థిక వ్యవస్థ నాశనం కావడం తప్ప ప్రయోజనం లేదన్నారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయనీ, రైతులు చాలా అవస్థలు పడుతున్నారని చెప్పారు. అందుకే, ఇప్పుడు అందరూ కలిసికట్టుగా వీటన్నింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. రాజ్యాంగాన్నీ, ప్రజాస్వామ్యాన్నీ, దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇదన్నారు.
తాను దేశంలోని ప్రాంతీయ పార్టీల తరఫున, లేదా కాంగ్రెస్ తరఫున ఈ ప్రయత్నం చేయడం లేదనీ… దేశాన్ని కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి, ఒక బాధ్యతగల నాయకుడిగా స్పందిస్తున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు. వచ్చే ఎన్నికల తరువాత ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తారా అనే ప్రశ్నలు మీడియా వేస్తే.. చంద్రబాబు అలా స్పందించారు. ఆ విషయం సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలూ చర్చంచి నిర్ణయం తీసుకుంటాయన్నారు. తాను మాయావతి, అఖిలేష్ యాదవ్ తో మాట్లాడాననీ, రేపు స్టాలిన్ తో భేటీ అవుతున్నాననీ… ఇలా అందరితోనూ తాను కలవబోతున్నానని చెప్పారు. ఆ తరువాత, తమ కార్యాచరణ ఏంటనేది నెమ్మదిగా తెలుస్తుందన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా… కేంద్రంలోని భాజపా ఆంధ్రాను మోసం చేసిందనీ, అందుకే ఎన్డీయే నుంచి బయటకి రావాల్సి వచ్చిందన్నారు.