ఇసుక మాఫియాపై ఉక్కు పాదం మోపండి.. ఇదీ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు శుక్రవారం కలెక్టర్లకు ఇచ్చిన హుకుం. ఏర్పేడు ఘటన ఆయన కళ్ళు తెరిపించిందనుకోవాలా లేక..విమర్శలను ఎదుర్కొనడానికి ఇలా ఆదేశించారనుకోవాలా. తోటకూర దొంగిలించిన నాడే ఓ చెంప దెబ్బ వేసుంటే అనే నానుడి ఊరికే రాలేదు. చిన్న నేరానికైనా కఠినమైన శిక్ష విధించాలనీ, అది జీవితాంతం గుర్తుండేలా ఉండాలనీ పెద్దలు అంటుంటారు. నిజమే.. చిన్నప్పుడు లేత బుగ్గలమీద ఒక్కటిస్తే.. కందిపోయి కలిగించే బాధ వెంటాడుతూనే ఉంటుంది. తప్పు చేయాలనుకున్నప్పుడు అది గుర్తొస్తుంది. అప్రయత్నంగానే అడుగు వెనకకూ పడుతుంది.
ఇసుక మాఫియాకూ ఇది వర్తిస్తుంది. ఇసుక రీచ్‌లకు టెండర్లు పాడుకునే విధానం అమల్లో ఉన్పప్పుడు గొడవలు వారి మధ్యే ఉండేవి. వేలం పాటలు నిలిపేసి, ఉచితంగా ఇసుకను తవ్వుకోవచ్చని ఆదేశాలు ఇచ్చిన అనంతరం ఘర్షణల సంఖ్యతో పాటు గొడవపడే వారి సంఖ్యా పెరిగింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తహశీల్దారు వనజాక్షి నడుమ రగడ చంద్రబాబు గారి హితోక్తులతో సద్దుమణిగింది. రచ్చకెక్కకుండా చూసుకోవాలన్న బాబు సూచన వారిద్దరి మధ్య పరిస్థితిని చల్లబరిచినా.. రెవెన్యూ అధికారులకూ, ప్రజా ప్రతినిధులకూ మధ్య అగాధాన్ని పెంచింది. అవకాశమున్నప్పుడెల్లా రెవెన్యూ అధికారులను రెచ్చగొట్టడం, పబ్బం గడుపుకోవడం అలవాటైపోయింది. ఇలా ఎంతకాలం సాగుతుంది. ఏర్పేడు ఘటనకు ఇసుక మాఫియానే కారణమనే విమర్శలు ఇప్పటికీ చల్లబడకపోవడం చంద్రబాబుకు కునుకురానీయడం లేదు.
ఎలాగైనా దీనికి ముగింపు పలకాలనుకున్నారాయన. ఇసుక మాఫియా విచ్చలవిడిగా సాగుతున్న జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. కూలంకషంగా చర్చించారు. ఆపై ఉప ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రి ఆదినారాయణ రెడ్డి, కలెక్టర్లు సమావేశమై మేథోమథనం చేశారు. ఇసుక విధానంలో లోటుపాట్లు, సమస్య తలెత్తితే ఎలా పరిష్కరించాలీ, సమస్య తలెత్తకుండా ఎలా వ్యవహరించాలీ చర్చించుకున్నారు. దీనిమీద ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పిస్తారట. ఆ నివేదికను పరిశీలించి ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తారట. ఒక పక్క చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌తో తలనొప్పులను ఎదుర్కొంటున్న తరుణంలో ఏర్పేడు ఘటన మరింత ముదరకుండా ముఖ్యమంత్రి ఈ చర్య తీసుకున్నారనుకోవచ్చా. ఏది ఏమైనా సమస్య తీరితే మంచిది. అధికార పార్టీ ప్రయోజనాలకు ప్రజల ప్రాణాలు బలికాకూడదు.
ఇసుకపై సమస్యను మర్దిస్తుండగానే, సచివాలయంలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. అదే.. చింతమనేని ప్రభాకరరావు తహశీల్దారు వనజాక్షికి పుష్పగుచ్ఛం ఇచ్చి పలకరించారట. దీనితో వారిద్దరి నడుమ విభేదాలు తొలగిపోయినట్లేనా. అదే జరిగితే మిగిలిన సమస్యలు కూడా దూదిపింజల్లా తేలిపోతాయి. చంద్రబాబు వ్యూహ చతురతకు దీన్ని మించిన ఉదాహరణ ఉండదు కదా! సమస్య ఏదైనా తాత్సారం చేయకుండా పరిష్కరిస్తే వికృతరూపం దాల్చకుండా ఉంటుంది. వికృతరూపాన్ని అది సంతరించుకున్నప్పటికీ.. హిప్నటైజ్ చేసే చాతుర్యం ఆంధ్ర ప్ర్రదేశ్ ముఖ్యమంత్రిలో ఉంది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి