ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు… ఈ ప్రశ్నకి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మొదలుకొని, రాష్ట్ర భాజపా నేతల వరకూ అందరూ చెప్పిన స్టాండర్డ్ సమాధానం.. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది అనే కదా! హోదాకీ ఆర్థిక సంఘం సిఫార్సులకు ఏమాత్రం సంబంధం లేదనీ, అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నిర్ణయమే అవుతుందని సాక్షాత్తూ ఆర్థిక సంఘ సభ్యులే చెప్పిన సందర్భాలూ చాలా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె. సింగ్ కూడా అదే అభిప్రాయాన్ని వెల్లడించారు! ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో 15వ ఆర్థిక సంఘం సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక నివేదికను ఎన్.కె. సింగ్ కి ముఖ్యమంత్రి అందించారు.
ఏపీకి సమస్యలపై సింగ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా తమ పరిధిలోని లేని అంశమనీ, కానీ, ఏపీకి హోదా ఇవ్వొద్దన్న నెపాన్ని తమపై నెట్టేశారని సింగ్ అన్నారు. కాబట్టి, దీనిపై తాము ప్రత్యేకంగా కేంద్రానికి సిఫార్సు చేయాల్సిన పనిలేదనీ, ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలోని నిర్ణయమే అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. విభజన తరువాత పరిస్థితులన్నీ తానూ గమనిస్తున్నాననీ, రాష్ట్రానికి నిధులు కంటే అప్పులే ఎక్కువ వస్తున్నాయనీ, అభివృద్ధి చెందిన హైదరాబాద్ ను తెలంగాణకు ఇచ్చేశారనీ, ఈ నేపథ్యంలో కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒత్తిడి కారణంగా ప్రత్యేక హోదా వస్తుందని తానూ అనుకున్నానని సింగ్ చెప్పడం విశేషం. తరువాత పరిస్థితులు తనకే ఆశ్చర్యం కలిగించాయని కూడా ఆయన అన్నారు.
నిజానికి, ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎన్.కె. సింగ్ ని నియమించిందే మోడీ సర్కారు! ఇప్పుడాయన ఏపీకి వచ్చి, ప్రత్యేక హోదా రాకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చూస్తూ ఉండటం మరీ ఆశ్చర్యకరం! పోనీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికల్ని వెంటనే పరిగణనలోకి తీసుకునే పరిస్థితి ఉంటుందా అంటే.. అదీ లేదు! ఎందుకంటే, 15వ ఆర్థిక సంఘం నివేదికలు ఒక కొలీక్కి వచ్చేసరికి… లోక్ సభ ఎన్నికలు జరిగిపోతాయి. ఆ తరువాత, ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందో తెలీదు..! వచ్చిన ప్రభుత్వం వెంటనే ఏపీ అంశాలను టేకప్ చేస్తుందన్న గ్యారంటీ లేదు.
15వ ఆర్థిక సంఘం ఏపీ పర్యటన సందర్భంగా రెండు విషయాలు మరోసారి స్పష్టమయ్యాయి. ఒకటీ… ఆర్థిక సంఘం పేరును అడ్డుగా పెట్టుకుని ఏపీకి మోడీ సర్కారు హోదా ఇవ్వలేదనేది! రెండోది.. హోదా కోసం కేంద్రంపై దాదాపు నాలుగున్నరేళ్లపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఒత్తిడి తెచ్చారనీ, కానీ చివరికి వచ్చేసరికి కేంద్ర వైఖరి తమకే ఆశ్చర్యంగా ఉందని సింగ్ చెప్పడం!