కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ కలవడం చారిత్రక అనివార్యత అని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అదే సమయంలో గతం గురించి ఆలోచించకుండా.. భవిష్యత్ కోసమే పని చేస్తామంటూ రాహుల్ గాంధీ స్పష్టమైన ప్రకటన చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఇద్దరు కలిసి దాదాపుగా గంట సేపు చర్చలు జరిపారు. ప్రధానంగా దేశ రాజకీయాలు, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉండాల్సిన కూటమి గురించే చర్చ జరిగింది. సమావేశం తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. బీజేపీని వ్యతిరేకించే పార్టీలను ఏకతాటిపైకి తీసుకొస్తామని చంద్రబాబు ప్రకటించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వ్యవస్థలను ఈ విధంగా దుర్వినియోగం చేయడం తాను చూడలేదన్నారు. దేశంలో జరుగుతోన్న పరిణామాలపై రాహుల్‌తో చర్చించానని.. బీజేపీని ఓడించడం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం తమ ప్రధాన కర్తవ్యం కర్తవ్యమన్నారు. దేశాన్ని రక్షించుకోవడానికే చేతులు కలిపామన్నారు. ప్రజాస్వామ్యాన్ని..వ్యవస్థలను రక్షించుకోకపోతే భవిష్యత్ తరాలు దారుణంగా నష్టపోతాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు.
దేశానికి ఇది చాలా సంక్లిష్ట సమయమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థలను కాపాడటమే ముఖ్యమని, తాము దాని గురించే ఆలోచిస్తున్నామని అన్నారు. రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంపై దర్యాప్తు చేయగలిగిన దర్యాప్తు సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రఫేల్‌లో అవినీతిని ప్రజలు తెలుసుకోవాలన్నారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. పార్టీల మధ్య గతంలో జరిగిన అంశాలను మర్చిపోవాలని నిర్ణయించామన్నారు. అంతా కలిసి బీజేపీని ఓడించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించామన్నారు. రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందన్నారు.
ప్రధాని అభ్యర్థి ఎవరు అన్న మీడియా ప్రశ్నలకు రాహుల్ గాందీ… మీరు సంచలనాల కోసం అడుగుతున్నారని … తమకు అది ముఖ్యం కాదని తోసి పుచ్చారు. ఫ్రంట్‌కు ఏ ఒక్కరూ నాయకుడు కాదు.. అందరం కలిసి పని చేస్తమన్నారు. ప్రజాస్వామ్యాన్ని, వ్యవస్థల్ని రక్షించడమే మా కర్తవ్యమన్నారు.
చంద్రాబాబు ఢిల్లీ పర్యటన… జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మీడియా పెద్ద ఎత్తున కవరేజీ ఇచ్చింది. చంద్రబాబు అనుభవంతో.. ఫ్రంట్ కు రూపకల్పన చేస్తారని.. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు.. ఏకమవుతాయని విశ్లేషించారు. కూటమి విషయంలో చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ ఏం వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.