సంకీర్ణ రాజకీయాలు నడపడంలో గత అనుభవం ఉన్న.. టీడీపీ అధినేత చంద్రబాబు … చొరవ తీసుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీని మళ్లీ అధికారంలోకి రానివ్వకూడదన్న ఏకైక లక్ష్యంతో… ప్రాంతీయ పార్టీల నేతంలదరితోనూ … సంప్రదింపులు ప్రారంభించారు. ఫలితాల తర్వాత ఎలా వ్యవహరించాలన్న దానిపై.. అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఓ కూటమిగా ప్రజల దృష్టిలో ఉండాలంటే.. ఏం చేయాలన్నదానిపై… చర్చలు జరుపుతున్నారు. ఇదంతా.. తన కోసం చేస్తున్నారా..? కాంగ్రెస్ కోసం చేస్తున్నారా..?
విపక్షాల భేటీకి అందరూ వచ్చేలా చంద్రబాబు కసరత్తు..!
శుక్రవారం సాయత్రం నుంచి వరుసగా.. బీజేపీయేతర పార్టీల నేతలతో చంద్రబాబు సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. లెఫ్ట్ పార్టీల ముఖ్యులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్ రెడ్డిలతో పాటు.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌తోనూ.. చంద్రబాబు… చర్చలు జరిపారు. ప్రధానమంత్రి అభ్యర్థి అన్న విషయంపై ఏకాభిప్రాయంతో ముందుకెళ్లినా… ముందుగా.. ఓ కూటమిగా.. సమావేశం కావాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సమావేశంలో వచ్చింది. 23వ తేదీన జరగనున్న సమావేశంలో.. లెఫ్ట్ పార్టీలతో పాటు.. ఆమ్ ఆద్మీ కూడా పాల్గొనడం ఖాయమయింది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో గంట పాటు సమావేశమయ్యారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఏకం చేయడానికి.. కాంగ్రెస్ తరపున కాస్త పట్టు విడుపులు ప్రదర్శిస్తే బాగుంటుందన్న అంశంపై.. చంద్రబాబు.. చర్చలు జరిపారు. ఈ విషయంలో.. కాంగ్రెస్ పార్టీ అధినేతకు.. చంద్రబాబు కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, బీహార్ సీనియర్ నేత..శరద్ యాదవ్‌లతోనూ.. చంద్రబాబు చర్చలు జరిపారు. సమావేశం విషయంలో.. వీరు కూడా తమ అంగీకారన్ని తెలిపారు.
అందరూ బీజేపీ వ్యతిరేకులే.. కానీ ఐక్యత…!?
బీజేపీయేతర పార్టీల్లో… ప్రభుత్వాన్ని నిర్దేశించగలవని అంచనాలున్న పార్టీలు.. ఎస్పీ, బీఎస్పీ. పొత్తులు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు… ఉత్తరప్రదేశ్‌లో యాభై నుంచి అరవై వరకూ సీట్లు సాధిస్తాయన్న అంచనా ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడిన ఈ పార్టీలు.. బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదు. కానీ.. ఈ మాయావతిని ప్రధాని అభ్యర్థిగా..ప్రతిపాదిస్తున్నారు. ఇక్కడే సమస్య వచ్చి పడుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మాయావతి, అఖిలేష్ అంగీకరించడం కష్టమేనన్న అభిప్రాయం ఉంది. ఇప్పటికి అయితే.. మాయావతి, అఖిలేష్ యాదవ్‌కు.. ఫలితాలు వచ్చిన తర్వాత జరగనున్న ప్రాంతీయ పార్టీల కూటమి భేటీకి వచ్చేందుకు సంసిద్ధత తెలుపలేదు. ప్రధాని పదవిపై.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆమె కూడా ఇప్పటికీ.. సమావేశంపై .. పాజిటివ్‌గా స్పందించలేదు. పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు.
ఏకాభిప్రాయం పేరుతో తనకే చాన్స్ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారా..?
బీజేపీయేతర పార్టీల కూటమిలో చంద్రబాబు ప్రధానమైన మిషన్ మాత్రం మాయావతి, మమతా బెనర్జీలను ఒప్పించడమే. ప్రాంతీయ పార్టీలు పట్టుదలకు పోతే మోదీ మార్క్ రాజకీయంతో… మొత్తానికే మోసం వస్తుందని వివరించి చెప్పి.. అందర్నీ సమావేశానికి వచ్చేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు చంద్రబాబు లక్ష్యం.. బీజేపీని గద్దెనెక్కకుండా చేయడమే. ఆ తర్వాత… ప్రధాని పదవికి రేసులో ఉన్న వారి మధ్య ఏకాభిప్రాయం రాకపోతే.. అందరి చాయిస్‌గా తనకే అవకాశం వస్తుందన్న భావనలో చంద్రబాబు ఉండి ఉండవచ్చని.. అందుకే సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారన్న భావన వ్యక్తమవుతోంది.