పోరాటం రెండు రకాలుగా ఉంటుంది..! ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనుకోవడం ఒక రకం. ఎట్టి పరిస్థితిల్లోనూ ఓడిపోకూడదు అనుకోవడం రెండో రకం. రెండూ గెలుపు మార్గాలే కావొచ్చు. కానీ, పోరాట సన్నద్ధతతో మాత్రం తేడా ఉంటుంది కదా! నంద్యాల ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ రెండో మార్గాలోనే పోరాటానికి సిద్ధమౌతున్న కంగారు కనిపిస్తోంది. ఈ ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చేశాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఓ నిర్ణయం తీసుకున్నారు! రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ మీటింగ్ ప్రధాన అజెండా నంద్యాల ఎన్నికల్లో గెలుపు వ్యూహం ఏంటనేది. దాదాపు గంటకుపైగానే దీనిపై చర్చించారు. అనంతరం, నంద్యాల ఉప ఎన్నిక కోసం 12 మంది శాసన సభ్యులను ఇన్ ఛార్జులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోండా ఉమా, నిమ్మల రామానాయుడు, బోడే ప్రసాద్ తో సహా 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా నియమించినట్టు సమాచారం! వీరంతా ఈ గురువారం నుంచే రంగంలోకి దిగుతారనీ చెబుతున్నారు.
ఒక నియోజక వర్గంలో జరిగే ఉప ఎన్నికకు ఇంతమంది ఇన్ ఛార్జులను నియమించింది గతంలో లేదని కొంతమంది అంటున్నారు. అదీకాకుండా, ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలను ఒక ఉప ఎన్నికకు పంపడం కూడా అరుదైన సందర్భమే అనీ చెబుతున్నారు. ఇప్పటికే నలుగురు మంత్రులు రంగంలోకి దిగారు. జిల్లా నేతలూ, స్థానిక నాయకులతో రకరకాల బృందాలు ఏర్పాటు చేసి, బాధ్యతల్ని పంచేశారు. నంద్యాల ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు కృషి చేసిన వారికి భవిష్యత్తులో కొన్ని పదవులు ఉంటాయన్న ఆశ కూడా చూపించారు. నంద్యాలలో కీలకంగా ఉన్న వైశ్య, మైనారటీ వర్గాలను ఆకర్షించేందుకు ఆయా కమ్యూనిటీలకు చెందిన నేతలకు ఈ మధ్యనే నామినేటెడ్ పదవుల పంపిణీలో న్యాయం చేశారు! ఇంకోపక్క… నంద్యాలలో పెండింగ్ ఉండిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చకచకా చేయించేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లాలో ఓసారి పర్యటించి వచ్చారు. మరోసారి వెళ్లేందుకు కూడా ఆయన షెడ్యూల్ ఖారారు చేసుకున్నారని తెలుస్తోంది. ఇక, అన్న క్యాంటీన్లు వంటి గత ఎన్నికల హామీలను కూడా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలోనే నెరవేర్చేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పుడు… 12 మంది ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జులుగా నియమించారు.
ఒక ఉప ఎన్నిక కోసం ఎందుకింత టెన్షన్..? ఏకంగా అధికార పార్టీతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఎన్నికల్లో గెలుపు వ్యూహంలో భాగంగా వాడేస్తున్నారు..! ఇదంతా చూస్తుంటే… టీడీపీకి గెలుపు పోరాటమా, లేదా ఓటమి ఎదురు కాకూడదన్న భయమా అనే అనుమానాలు ఎవ్వరికైనా కలుగుతాయి. ఒకటి మాత్రం నిజం… నంద్యాల నియోజక వర్గంలో గతంలో వైసీపీ గెలుచుకున్నది. భూమా నాగిరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాక, అది తమదే అని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. సాంకేతికంగా అది ఇప్పటికీ ప్రతిపక్షం లెక్కలోని నియోజక వర్గమే. కాబట్టి, ఆ పక్క బెదురు ఎలాగూ ఉండనే ఉంటుంది. ఇప్పుడు నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డిని గెలిపించగలిగే అంశాలు రెండే రెండు. ఒకటీ భూమా మరణంపై సానుభూతి, రెండూ టీడీపీ ఇప్పటికిప్పుడు కురిపిస్తున్న వరాలు! అంతేగానీ, సాలిడ్ గా తమకంటూ నంద్యాలలో ఒక బలమైన పునాది ఉందనిగానీ, ఓటు బ్యాంకు ఉందనిగానీ టీడీపికి ధీమా లేదనే చెప్పాలి. ప్రస్తుతం ఆ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాల్లో ఆ తరహా ఆందోళనే కనిపిస్తోందన్న విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.