“బాబు విజన్ బాగుంది. అందుకే పార్టీ మారాం”, “సీఎం చంద్రబాబు ఈ రాష్ట్రానికి చేస్తున్న సేవలో మేము కూడా భాగం కావాలని భావించిన పార్టీలోకి వచ్చాం”- ఇటీ 2017, 2018 మధ్య కాలంలో అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైసీపీ నుంచి అధికార పక్షం టీడీపీలోకి జంప్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేల చిలకపలుకులు! మరికొందరు జగన్ వైఖరి నచ్చకే పార్టీ మారుతున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. ఇలా 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. వీరిలో మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం. ఇక, వీరిలో కొందరు మంత్రి పదవులను కైవసం చేసుకోగా, మరికొందరు నామినేటెడ్ పదవుల్లో కుదురుకున్నారు. ఇంకొందరు కాంట్రాక్టులు దక్కించుకున్నారు.
ఏదేమైనా.. పార్టీ మారినందుకు ‘ఫలితం’ పొందారు! అంతేనా… తాజాగా ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వీరిలో చాలా మందికి చంద్రబాబు కూడా టికెట్లు ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, వీరిలో గెలిచింది ఎవరు? అనే ప్రశ్న తెరమీదికి వచ్చినప్పుడు మాత్రం ఒక్కరూ కనిపించడం లేదు. జగన్ పేరుపై గెలిచి, వైసీపీ జెండా, అజెండాలతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి.. చంద్రబాబుపై మోజుతో పార్టీ మారిన వీరిని ప్రజలు తిప్పికొట్టారు. గుండుగుత్తుగా ఈ జంపింగులను, వారి వారసులను(కొన్ని చోట్ల వారివారసులకు చంద్రబాబు టికెట్లు ఇచ్చారు) ప్రజలు చిత్తుగా ఛీకొట్టారు. ఓకే..ఓకే.. ఇది కూడా జరిగేదే. అయితే, ఇప్పుడు ఫ్యూచరేంటి? తనను నమ్మి వచ్చారు.. ఓడిపోయారు.. అయ్యో.. వారికి ఏదైనా చేయాలి! అని చంద్రబాబు కానీ, వైసీపీని వదులుకుని టీడీపీ పంచన చేరాం.. “మనది మనకు ముట్టింది. అయినా పార్టీ ఓడిపోయింది. మళ్లీ దీనిని పుంజుకునేలా చేయాలి!” అని జంపింగులు కానీ ఎక్కడా ఆలోచించడం లేదు. ఇటు చంద్రబాబు.. అటు జంపింగులు కూడా మౌనంగానే ఉన్నారు. అయితే, జంపింగులను నమ్ముకుని, వారి వెంట తిరిగిన అనుచరులు, కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు. “మీకు మీరు బాగానే ఉన్నారు. మా పరిస్థితి ఏంటి?” అని వారు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పాడేరు మాజీ ఎమ్మెల్యే, జంపింగ్ నాయకురాలు గిడ్డి ఈశ్వరి స్థానికంగా ఓ ఫంక్షన్కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతున్న సమయంలో ఆమె అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
తమ ఫ్యూచర్ ఏంటని ప్రశ్నించారు. అదేవిధంగా చిత్తూరు జిల్లా పలమనేరులోనూ మాజీ ఎమ్మెల్యే, మంత్రి, జంపింగ్ నేత అమర్నాథ్రెడ్డికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. అలాగే, మరో జంపింగ్ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కి కూడా ఇదే తరహా విమర్శలు వస్తున్నాయి. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు.. తన పార్టీ సీనియర్లనే పట్టించుకునే పరిస్థితిలో లేరు. ఇక, ఈ జంపింగులను ఎక్కడ పట్టించుకుంటారు? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో అసలు వీరి భవితవ్యం ఏంటి? అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హల్చల్ చేస్తోంది.