తెర మరుగైపోయింది అనుకున్న అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో ఉండే అవకాశాలు లేదన్నట్టుగానే కేంద్రం తీరు ఉంది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు కూడా చాలాసార్లు ఇదే ప్రతిపాదనతో ఢిల్లీకి వెళ్లొచ్చారు. అయితే, భాజపా సర్కారు నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ఇద్దరు చంద్రులూ కొన్నాళ్లుగా ఈ విషయం గురించి మాట్లాడటం తగ్గించుకున్నారు. శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పోలవరం, ప్రత్యేక ప్యాకేజీ నిధులతోపాటు నియోజక వర్గాల సంఖ్య అంశాన్ని కూడా కేంద్ర పెద్దలతో ప్రముఖంగా ప్రస్థావించారు. త్వరలోనే సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు మరోసారి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రాబోతున్నాయని మరోసారి ధీమాగా చెబుతున్నారు.
నియోజక వర్గాల సంఖ్య పెంచే విషయమై కేంద్రం సానుకూలంగా స్పందించింది అని చంద్రబాబు చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ తో భేటీ అనంతరం ఈ విషయాన్ని మీడియాకి వివరించారు. హోం మంత్రితోపాటు, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో కూడా ఫోన్లో మాట్లాడాననీ, ఇదే అంశం మరోసారి చెప్పానని అన్నారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించారన్నారు. చిన్న చిన్న రాష్ట్రాల్లో రాజకీయ సుస్థిరత రావాలంటే, అసెంబ్లీ స్థానాల సంఖ్య రీజనబుల్ గా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పడం గమనార్హం! అలాంటి స్టెబిలిటీ కోసం నియోజక వర్గాల సంఖ్య పెంపు ఉపయోగపడుతుందని విశ్లేషించారు! వచ్చే ఏడాదిన్నరలో ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తే సాధ్యమౌతుందో ఆయా మార్గాల ద్వారా పని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజకీయ సుస్థిరత కావాలంటే రీజనబుల్ సీట్ల సంఖ్య ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు! వినడానికి బాగానే ఉంది. అంటే, ఈ లెక్కన ఆంధ్రాలో రాజకీయ సుస్థిరత లేదని చెబుతున్నట్టు అర్థం చేసుకోవాలా.? నిజానికి, ఇప్పుడు ఉన్న ఈ అస్థిరతకు కారణం ఎవరు..? ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడింది అధికార పక్షాలే. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం కోసం ఈ దుస్సంప్రదాయానికి ఆజ్యం పోసిందే వారు. రాజీనామాలు చేయని ఎమ్మెల్యేలకు పార్టీ కండువాలు కప్పేసి, కొందరికి మంత్రి పదవులు ఇచ్చేశారు. జంప్ జిలానీలకు అవకాశం కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో అదో సమస్యగా మారుతుంది. అధికార పార్టీ తలనొప్పిని రాష్ట్ర సమస్యగా మార్చేశారు! అందుకే, సీట్ల సంఖ్య పెంపు పెంపూ అంటూ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. చంద్రబాబు గానీ, కేసీఆర్ గానీ.. సీట్ల సంఖ్యతో వారు కోరుకుంటున్నది రాజకీయ సుస్థిరత వేరే. ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ సుస్థిరత, తెలంగాణలో తెరాస సుస్థిరత, అంతే! పోలవరం నిధులు, ప్యాకేజీ ప్రయోజనాలు సకాలంలో వచ్చినా రాకపోయినా.. ఈ నియోజక వర్గాల సంఖ్యను మాత్రం సకాలంలోనే సాధించుకునే పట్టుదల వారిలో స్పష్టంగా కనిపిస్తోంది.