ఉపమానాలు చెప్పడంలో మన నాయకులు ఉద్దండులు. స్క్రిప్టు రాయించుకుని మాట్లాడతారో… లేదా, ఆసువుగానే అలాంటి అలంకార ప్రయోగాలు చేస్తారో తెలీదుగానీ, మాటల గారడీల మధ్యలో వైఫల్యాలను కూడా విజయాలుగా ధ్వనింపజేస్తుంటారు! కొత్త సంవత్సరం నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇదే తరహా మాట్లాడారు! 2016 ఏపీకి ఒక చారిత్ర సంవత్సరమని అన్నారు. గత ఏడాది ఎన్నో సాధించామని చెప్పారు! నిజానికి, 2016లో టీడీపీ సాధించింది ఏంటంటే.. ప్రత్యేక హోదాని వదులుకుని ప్యాకేజీ తెచ్చుకోవడం. హోదా తెచ్చుకోలేని వైఫల్యాన్ని ప్యాకేజీ సాధించిన విజయంగా చెప్పుకోవడం! చాన్నాళ్ల తరువాత మరోసారి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడటం విశేషం.
ప్రత్యేక హోదా అనేది అరుంధతి నక్షత్రం లాంటిందని చంద్రబాబు చెప్పారు. అది కనిపించకపోయినా సరే… కనిపించిందనే ఒప్పుకోవాలన్నారు. తనకు సబ్జెక్టు బాగా తెలుసుననీ, ఎంతో లోతైన విశ్లేషణ చేస్తే తప్ప ఎలాంటి నిర్ణయాలు తీసుకోని వ్యక్తిననీ, అందుకే ఎన్నో కోణాల నుంచి ఆలోచించి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాను అని వివరించారు. సో… ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకోవడం వెనక ఇంత మేథోమథనం ఉందన్నమాట!
ఇక, వెలగపూడి గురించి మాట్లాడుతూ… ఇక్కడికి వచ్చాక అన్ని పనులూ చాలా వేగంగా జరిగిపోతున్నాయన్నారు. వెలగపూడి వచ్చిన దగ్గర నుంచీ అంతా పాజిటివ్‌గానే ఉంటోందని చంద్రబాబు చెప్పారు. ఏ పని మొదలుపెట్టినా టకటకా పూర్తైపోతోందని ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని శంకుస్థాపన సమయంలో ఈ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచీ పవిత్ర మట్టీ పవిత్ర జలాలు తీసుకొచ్చామనీ, అందువల్లనే వెలగపూడి ఒక శక్తి పీఠంలా తయారైందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు!
ప్రత్యేక హోదా సాధించుకోలేకపోవడం ముమ్మాటికీ తెలుగుదేశం వైఫల్యం. దానికీ లేనిపోని సెంటిమెంట్లు జోడించడమేంటో! వెలగపూడి వచ్చినంత మాత్రానే అన్ని పనులూ అయిపోతాయా..? ప్రజల నమ్మకాలూ విశ్వాసాల ప్రాతిపదికగా చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నట్టున్నారు.