బాబ్లీ ఆందోళన కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కావడం లేదు. న్యాయవాదిని పంపించి నాన్ బెయిలబుల్ వారంట్ ను రీకాల్ చేయించాలని ఏపి ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిదేళ్ల క్రితం.. బాబ్లీకి వ్యతిరేకంగా ఆందోళన చేసిన అందర్నీ బలవంతంగా విమానం ఎక్కించి పంపించారు. అప్పుడే కేసులు ఎత్తివేస్తున్నామని మహరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత మహారాష్ట్ర ప్రభుత్వం పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద 16మందిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో పలు మార్లు వాయిదాలు జరిగాయి. కానీ 16మందికి నోటీసులు అందలేదు.
మంగళవారం మధ్యాహ్నం నాందెడ్ ఎస్పీ.. ఏపీ పోలీసు ప్రధాన కార్యాలయానికి ఫోన్ చేశారు. ఏపీ సీఎంపై నాన్ బెయిలబుల్ వారెంటు ఉందని సమాచారం ఇచ్చారు. వారెంటును కూడా ఫ్యాక్స్ చేస్తున్నామని చెప్పారు. కానీ సమాచారం ఉన్న లేఖ మాత్రమే ఫ్యాక్స్ చేశారు. నాన్ బెయిలబుల్ వారెంటు కాపీ పంపలేదు.
వారెంట్ పంపకపోవడంతో… నాందేడ్ ఎస్పీకి ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేశారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. కేసు పత్రాలు లేకుండా ఎలా కోర్టుకు హాజరవుతారంటూ ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ప్రశ్నించారు. దాంతో నీళ్లు నమలడం.. నాందేడ్ పోలీసుల వంతయింది. వారెంట్ పంపకపోవడంతో 21 వతేదీన లాయర్ ను పంపించి కేసుకు సంబంధించిన ఎఫ్ ఐ ఆర్ , చార్జిషీట్ , వారెంట్ కాపీలు తీసుకోవాలని న్యాయవాదిని పంపించనున్నారు. అందరి తరపున రీకాల్ పిటీషన్ కూడా వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు న్యాయ , పోలీసు ఉన్నతాధికారులతో ఓ కమిటీని వేసి ఈ కేసును ఎప్పటికప్పడు పర్యవేక్షించనున్నారు.
రాజకీయ కారణాలతోనే వారెంట్ జారీ అయిందని… తెలుగుదేశం పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే రాజకీయంగానే ఎదుర్కొవాలనే ఆలోచన చేశారు. 21న భారీ ప్రదర్శనగా ధర్మాబాద్ వెళ్తే రాజకీయ ప్రచారం కూడా వస్తుందని అంచనా వేశారు. కానీ 22వ తేదీన సాయంత్రం… చంద్రబాబు అమెరికా బయలుదేరాల్సి ఉంది. ఈ ఏర్పాట్ల కారణంగా…లాయర్ ను పంపి.. రీకాల్ పిటిషన్ వేయించాలని నిర్ణయించారు.