రాష్ట్ర విభజన జరిగి నాలుగున్నరేళ్లయింది. ఇదిగో.. అదిగో అంటున్న విభజన హామీల్లో నేరవేర్చినవి ఏమీ లేవు. చట్టంలో పరిశీలించమని ఉంది కాబట్టి.. పరిశీలిస్తున్నామని.. కేంద్రం పదే పదే చెబుతోంది. అలాగే..కడప స్టీల్ ప్లాంట్‌నూ ఇంకా పరిశీలిస్తోంది. వేచి చూసి.. చూసి.. ఏపీ ప్రభుత్వం.. కడప స్టీల్ ప్లాంట్‌కు.. శంకుస్థాపన చేసింది. ప్రైవేటు రంగం నుంచి ఎవరు ముందుకొస్తే వారితో కలిసి ప్లాంట్ పెట్టాలని నిర్ణయించుకుంది. చంద్రబాబు శంకుస్థాపన చేసిన తర్వాత తీరిగ్గా.. ఓ ప్రకటనను కేంద్రం విడుదల చేసింది. అదేమిటంటే.. చంద్రబాబు సమాచారం ఇవ్వడం లేదనేది.. ఆ ప్రకటన సారాశం. కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇప్పటికే పది సార్లు ఇచ్చినా… అదే మాట చెబుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రాష్ట్రం .. ఇటు కేంద్రం మధ్య ” కమ్యూనికేషన్ గ్యాప్ ” ఉందని.. వీరి ప్రకటనలు చూస్తే అర్థమైపోతుంది. కానీ.. నిజానికి అది సమాచార లోపం కాదు.. రాజకీయ శాపమే అని.. లోతుగా చూస్తే అర్థమైపోతుంది.
స్టీల్ ప్లాంట్ అసాధ్యమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ నిజం కాదా..?
ఇప్పటి వరకూ.. కడప స్టీల్ ఫ్యాక్టరీపై.. కేంద్రం వేసిన పిల్లిమొగ్గలు అన్నీ ఇన్నీ కావు. విభజన చట్టం ప్రకారం మొదట్లోనే… స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా నిపుణుల బృందంతో పరిశీలన జరిపించింది. సాధ్యం కాదని రిపోర్ట్ తెప్పించుకుంది. దాంతో.. ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. విభజన చట్టం హామీల అమలుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు.. సెయిల్, మెకాన్ వంటి సంస్థలు అందించిన నివేదికల మేరకు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఆర్థికంగా సాధ్యం కాదని అఫిడవిట్ దాఖలు చేసింది. తమ విధానం ఏమిటో నేరుగా చెప్పింది. ఆ తర్వాత రాజకీయం కోసం .. బయట వేరే మాటలు చెప్పడం ప్రారంభించారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై స్పందన ఏది..?
కడప జిల్లాలో 30 సంవత్సరాలకు సరిపడా ఇనుప ఖనిజం అందుబాటులో ఉంది. రైల్వే లైనుకు 20కి.మీ దూరంలో, విద్యుత్ గ్రిడ్ లైన్‌కు 7కి.మీల దూరంలో, గండికోట రిజర్వాయర్‌కు 10కిమీల దూరంలోనే ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మెకాన్ సంస్థ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలమైన నివేదిక ఇచ్చినప్పటికీ, టాస్క్‌ఫోర్స్ నివేదికను బయటపెట్టకుండా సెయిల్ ఇచ్చిన ప్రాథమిక నివేదికను మాత్రమే పరిగణనలోకి తీసుకుని పరిశ్రమ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడానిక ముందు కొంతమంది కేంద్ర మంత్రులు, బీజేపీలోని పెద్దలు స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని ప్రకటించారు. కానీ అన్నీ ఉత్తుత్తి ప్రకటనలే.
మెకాన్ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కి పెట్టారు..?
సమాచారం ఇవ్వడం లేదని.. కేంద్రం చెబుతోంది కానీ… మెకాన్ మాత్రం… ఫీజుబిలిటి రిపోర్ట్ ఇచ్చింది. 2018 జనవరి 4, 6 తేదీల్లో మెకాన్ సంస్థ క్షేత్రస్థాయి పర్యటనలో రాష్ట్రానికి వచ్చి సాధ్యాసాధ్యాలను పరిశీలించి కేంద్రాన్ని నివేదికను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ నిల్వలు ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు తగినట్లుగానే ఉన్నాయని ఆ నివేదికలో ఉంది. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో 110 మిలియన్ టన్నులు, ప్రకాశం జిల్లాలో మరో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఏపీలో ఉన్నట్లుగా నివేదికలో తెలిపింది. కానీ పూర్తి స్థాయి నివేదిక అంటూ.. కేంద్రం కబుర్లు చెబుతోంది. రాజకీయం కోసం… కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మంత్రిత్వ శాఖలు ఇలా ప్రకటనలు చేయడంపై అందరిలోనూ విస్మయం వ్యక్తం అవుతోంది.
——-సుభాష్