నారా లోకేష్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కొన్నాళ్ల కిందట వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! మంత్రి పదవి ఇవ్వడంపై చంద్రబాబు తాత్సారమే అందుకు కారణమన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ మౌనాన్ని బద్దలు కొడుతూ టీడీపీ నేతల శిక్షణ కార్యక్రమంలో లోకేష్ మాట్లాడి, ఆ చర్చకు తెర దించిన సంగతి కూడా తెలిసిందే! అయితే, ఇప్పుడు మరోసారి లోకేష్ పనితీరుపై చంద్రబాబు పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు దేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ మధ్య తెలుగుదేశం పార్టీ భారీ ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక యాప్ ద్వారా సభ్యత్వ నమోదు మొదలుపెట్టారు. అంతేకాదు, టీడీపీ సభ్యత్వం తీసుకున్నవారికి బీమా సదుపాయం కూడా కల్పించారు. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క నెలలోనే దాదాపు 25 లక్షల మందిని సభ్యులుగా చేర్చి రికార్డు సాధించినట్టుగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఘనంగా చెప్పారు. ఆ క్రెడిట్ అంతా చినబాబుకు దక్కుతుందనీ, ఆయన అనుసరించిన విధానాలకు ప్రజలు బాగా ఆకర్షితులౌతున్నారనీ, అందుకే సభ్యత్వ నమోదు కార్యక్రమం అద్భుతంగా సాగుతోందని చెప్పుకొచ్చారు. ఆ క్రెడిట్ అంతా లోకేష్ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. అయితే, ఈ ప్రక్రియపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేసినట్టు సమాచారం!
పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ టాపిక్ చర్చకు వచ్చిందని తెలుస్తోంది. గడచిన సంవత్సరంలో 50 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకుంటే… ఈ ఏడాది 37 లక్షల సభ్యత్వాలు మాత్రమే నమోదు అయ్యాయని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ప్రభుత్వానికి అంతా అనుకూలంగా ఉన్నా కూడా ఈ సంఖ్య ఎందుకు తగ్గిందని ఆయన ఆగ్రహించారట. అంతేకాదు, తెలుగుదేశం సర్కారుపై ప్రజల్లో సానుకూలత ఉన్నా మంత్రులూ నాయకుల తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు సూచించినట్టు సమాచారం. అంతేకాదు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగించమంటూ కూడా సూచించారట.
రికార్డు స్థాయిలో సభ్యత్వ నమోదు ప్రక్రియ జరిగిపోయిందని సరిగ్గా ఓ పది రోజుల కిందటే జబ్బలు చరిచేసుకున్నారు! ఆ క్రెడిట్ మొత్తం లోకేష్ బాబుకే చెందుతుందని చాటింపేశారు. కానీ, వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నట్టు చంద్రబాబు మాటల ద్వారా అర్థమౌతోంది. ఇక, తెలంగాణలో సభ్యత్వ నమోదు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదట! మొత్తానికి చినబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ నమోదు ప్రక్రియపై చంద్రబాబు తీవ్రంగా అసంతృప్తితో ఉన్నారన్నది వాస్తవం. మరి, దీనిపై లోకేష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.