తెలంగాణ తెలుగుదేశం పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. మిగులున్న ఒకరిద్దరికి కూడా పార్టీ భవిష్యత్తుపై నమ్మకం లేని పరిస్థితి. ఈ మధ్యనే, కొంతమంది నేతలు భాజపాలో చేరిపోయారు. ఆ సందర్భంలో కూడా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు నుంచి ఎలాంటి స్పందనా లేదు! వెళ్తున్న నేతల్ని ఆపే ప్రయత్నంగానీ, వారిని బుజ్జగించి పార్టీలో కొనసాగించే కృషిగానీ ఎవ్వరు చెయ్యలేదు. రాష్ట్రంలో పార్టీని అధినాయకత్వం పట్టించుకోవడం లేదనీ, టీడీపీ ఉంటే భవిష్యత్తు ఉండదనీ, బాధగానే పార్టీని వీడుతున్నా అంటూ కంటతడి పెట్టుకుని మరీ దూరమయ్యారు గరికపాటి రామ్మోహన్ రావు. ఇవన్నీ జరిగియాక.. ఇప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖపై దృష్టిపెట్టబోతున్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.
తెలంగాణ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఈ నెల 14న వారితో భేటీ ఉంటుంది. ప్రతీ శనివారం రాష్ట్ర నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారు. తెలంగాణ పార్లమెంటు నియోజక వర్గాల వారీగా సమావేశాలుంటాయని సమాచారం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, ఎలా వ్యవహరించాలనే అంశంపై ప్రధానంగా టి.నేతలతో చర్చిస్తారు. దీంతోపాటు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల పరాజయం గురించి కూడా విశ్లేషించుకునే అవకాశం ఉందని సమాచారం. నిజానికి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత ఎలాంటి సమీక్షా జరగలేదు. ఫలితాలపై ఎలాంటి విశ్లేషణా చేయలేదు. దీంతో, ఆ సమయంలోనే చాలామంది టీడీపీకి చెందిన జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు పార్టీ నుంచి బయటకి వెళ్లిపోయారు.
ఆ తరువాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దూరంగా టీడీపీ ఉంది. దీంతో ఇతర నేతలకు కూడా నమ్మకం దాదాపు పోయిందనే చెప్పాలి. ఆ సందర్భంలో ఇలాంటి సమావేశం ఒక్కటైనా నిర్వహించి ఉంటే, ఉన్నవాళ్లకి కాస్తైనా ధైర్యం వచ్చేసి, భవిష్యత్తుపై ఎంతో కొంత భరోసా ఏర్పడేది. అంతా జరిగిపోయాక… ఇప్పుడు నియోజక వర్గాల వారీగా సమావేశాలంటే ఏం చర్చిస్తారు? అయితే, ఇప్పటికైనా తెలంగాణ మీద దృష్టి సారించారనేది టి. నేతల్లో కొంత ఆనంద వ్యక్తమౌతున్న పరిస్థితి. తెలంగాణ విషయంలో ఏవైనా కొత్త వ్యూహాలతో ఉన్నారో ఏంటో అనేది ఈ సమావేశాల తరువాత తెలుస్తుంది.