ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై.. తన అవిశ్వాసాన్ని ప్రకటించే విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. అది ప్రజలు నమ్ముతారా.. కనీసం లాజిక్ ఉందా.. లేదా.. అనే విషయంలో… ఆయన ఒక్క శాతం కూడా సంశయం పెట్టుకోవడం లేదు. ఆరోపణలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొత్తగా ఆయన రష్యా హ్యాకర్లపై దృష్టి పెట్టారు. వారు హ్యాక్ చేస్తున్నారని… చెప్పి కలకలం రేపారు.
“బాబో”య్… రష్యా హ్యాకర్లు వచ్చేశారా..?
ఎన్నికలు ముగిశాయి. జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమయ్యాయి. ఇలాంటి సమయంలో.. ఇంత కాలం కష్టపడ్డాం కాబట్టి.. కాస్త రిలాక్స్ అవ్వాలని ఎవరైనా అనుకుంటారు. అలాగే అనుకున్నారు.. ఒక్క చంద్రబాబు తప్ప. ఏపీలో ఒక్క చంద్రబాబు తప్ప.. అన్ని పార్టీల నేతలు రిలాక్సయ్యారు. జగన్ స్విట్జర్లాండ్ వెళ్లి కుటుంబంతో గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్నారు. ఇక మొదటి శ్రేణి, ద్వితీయ శ్రేణి నేతలు… శ్రీలంకకో.. మరో చోటకో పోయి కాస్త సేదదీరే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం… జరిగిపోయిన ఎన్నికల గురించి.. వాటిలో వాడిన ఈవీఎంల గురించి… అనుమానాలు వ్యక్తం చేస్తూ దేశం మొత్తం తిరుగుతున్నారు. నిన్నామొన్నటిదాకా.. ఈవీఎంల మొరాయింపు.. ప్రోగ్రామింగ్ మార్పు… అన్న ఆయన ఇప్పుడు రష్యన్ హ్యాకర్లను సీన్ లోకి తీసుకు వచ్చారు. వాళ్లకు రూ. 10కోట్లు ఇస్తే ఫలితాల్ని మార్చేస్తామంటున్నారని.. ఆరోపించారు.
ఈవీఎంల సర్వీస్ ఏమిటో..? ఎవరికో అప్పగించడం ఏమిటో..?
అసలు రష్యన్ హ్యాకర్ల గురించి చంద్రబాబు ఎందుకు చెబుతున్నారు..?. అమెరికా ఎన్నికల్లో.. రష్యన్ హ్యాండ్ ఉందని… గగ్గోలు రేగింది. అక్కడ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని చెప్పుకున్నారు. ట్రంప్‌కు అనుకూలంగా పుతిన్ పని చేశారన్న ప్రచారమూ జరిగింది. అదే రష్యా.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మోడీకి.. తమ దేశ అత్యున్నత పురస్కారం ఇచ్చింది. ఎందుకిలా ఇచ్చింది..? అసలుమోడీ ఏం చేశారు..? రష్యాకు ఎందుకంత ఇష్టమయ్యారు..? ఇలాంటి ప్రశ్నలు సహజంగానే చాలా మందిలో వచ్చాయి. బహుశా.. చంద్రబాబు కూడా.. ఈ కోణంలోనే ఆలోచించి ఉంటారు. ఆయన ఇప్పుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ ఈవీఎం కాబట్టి…. ఆ రష్యాకు.. ఈవీఎంలకు లింక్ పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే.. చంద్రబాబు.. కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా ప్రెస్మీట్లో చెప్పారు. సర్వీస్ పేరుతో.. డిసెంబర్లో ఏడు రాష్ట్రాల ఈవీఎంలను ఎవరికో అప్పగించారని చెబుతున్నారు. ఎవరికో ఎందుకు అప్పగిస్తారు. .. సర్వీస్ చేస్తే గీస్తే… వాటిని తయారు చేసిన ఈసీఐఎల్, బీఈఎల్ చేయాలి. అలా కాకుండా.. వేరే వారి దగ్గరకు పంపితే… మాత్రం… ఆలోచించాల్సిందే. కానీ అలా పంపినట్లు.. చంద్రబాబు ఎలాంటి ఆధారాలు బయటపెట్టడం లేదు. నోటి మాటగానే అంటున్నారు.
ఈవీఎంలపై అనుమానబీజం నాటడమే లక్ష్యమా..?
ఇప్పుడు చంద్రబాబు ఓ మిషన్ మీద ఉన్నారనిపిస్తోంది. అదేమిటంటే… ఈవీఎంలపై అపనమ్మకం వ్యాపింప చేయడం. తనకు ఏ మాత్రం నమ్మకం లేని.. ఈవీఎంలను దేశం అసలు నమ్మకూడదని ఆయన అనుకుంటున్నారు. అందు కోసమే… పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల విషయంలో ఆయన చెబుతున్నది నిజాలో.. అబద్దాలో.. ఎవరికీ తెలియదు. కానీ.. ఓ అనుమాన బీజం అంటూ ఈవీఎంలపై పడితే… చాలని ఆయన అనుకుంటున్నారు. కొంత మంది చంద్రబాబు.. ఓటమి భయంతో నే అలా చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. మరికొంత మంది ఆయన ఎజెండా మరీ కామెడీగా ఉందని అంటున్నారు. మరికొంత మంది… ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నమంటున్నారు. ఏమైనా కానీ.. చంద్రబాబు…చెప్పే ఈవీఎంల రష్యా హ్యాకింగ్ కథ మాత్రం.. అతిశయోక్తే..!
కొసమెరుపేమిటంటే.. ఇప్పుడు దేశంలో ఆన్ లైన్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీ వచ్చిందని.. యువరాణి పెళ్లి చేసుకుంటుందని.. కాంట్రాక్టులిప్పిస్తామని..మోసం చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు రాజకీయ నేతల ఆత్రుతను కనిపెట్టి.. ఈ నైజీరియన్ తరహా మోసాలు… బయలుదేరినట్లుగా భావింవచ్చు. ఎవరైనా రష్యన్ హ్యాకర్ల పేరుతో.. కలిసి రూ. పది కోట్లు ఇస్తే మార్పు చేస్తామని చెప్పి మోసం చేస్తున్నారేమో.. అలాంటి సమాచారం ఏదో చంద్రబాబుకు వచ్చి ఉంటుంది… దాన్ని ఇలా కవర్ చేసుకుంటున్నారని అనుకోవచ్చేమో..?