ఒకవైపు తాత్కాలిక భవనాలకు వందల కోట్లరూపాయలు వెచ్చించడానికి ముందూ వెనుకా చూసుకోకుండా దూసుకువెళ్లిపోయే తెగింపు ఉన్న చంద్రబాబునాయుడు.. కొన్ని వేల మంది ప్రజలు ఉమ్మడిగా లాభపడే అద్దెల విషయంలో ఎందుకు ఇంతగా విలపిస్తున్నారో జనానికి అర్థం కావడం లేదు. సాధారణంగా ఆర్థిక లావాదేవీతో ముడిపడిన ఏ వ్యవహారం అయినా ‘డిమాండ్ అండ్ సప్లయి’ అనే సూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. చంద్రబాబునాయుడు బెజవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తర్వాత.. అక్కడికి అధికారులు వెళ్లడం ఇంకా మొదలు కాలేదు. కానీ ప్రెవేటు వ్యాపారాలను, దందాలను నమ్ముకుని అక్కడకు వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. వారంతా అక్కడ నివాసాలు, అతిథిభవనాలు కోరుకుంటున్నారు. ఈ డిమాండును బట్టి సహజంగానే ఇంటి అద్దెలు కూడా పెరిగాయి.
కానీ చంద్రబాబు నాయుడుకు విజయవాడ వాసులు అద్దెరేట్లు పెంచేయడం అనేది పెద్ద సామాజిక ద్రోహంలాగా కనిపిస్తూ ఉండడం చాలా చిత్రంగా ఉంది. ఇదివరలో కూడా ఆయన ఈ ఉక్రోషాన్ని దాచుకోకుండా ప్రదర్శించారు. విజయవాడ వాసులు అద్దెలు తగ్గించుకోకపోతే.. వారే నష్టపోతారని.. నగరానికి రావాల్సిన అభివృద్ధి రాదని ఆయన హెచ్చరించారు.
ఇవాళ మరోసారి ఆయన విజయవాడ ప్రజల అద్దెల గురించి తన అక్కసు ప్రదర్శించారు. విజయవాడలో వ్యాపారం చేయడం కంటె సింగపూర్ లో వ్యాపారం చేయడం చాలా చవగ్గా ఉంటుందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఒక రకంగా అభ్యంతరకరమే. విజయవాడలో కొన్ని వేల ఇళ్లు అద్దెలకు ఉన్నాయనే అనుకుందాం. వేలమంది కలిసి మరి కొన్ని వేల రూపాయల మొత్తాన్ని అదనపు అద్దెల రూపంలో లాభ పడుతున్నారనే అనుకుందాం.. దానికి కత్తెర వేసి చంద్రబాబునాయుడు ఏం సాధించాలనుకుంటున్నారు.
ఆయనేమో ఒకవైపు ప్లాన్లకోసం అధ్యయనాలకోసం నగరాల నిర్మాణాన్ని పరిశీలించడం కోసం తమ బృందాలను వందలకోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేక విమానాల్లో దేశవిదేశాలు తిప్పుతూ ఉంటారు. చేసినచోటే మళ్లీ మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ.. అసలు పనికంటె ఆర్భాటం ఎక్కువ చేస్తూ.. దానికి కొన్ని కోట్ల కోట్ల రూపాయలను తగలేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న సెక్రటేరియేట్ శంకుస్థాపన అంటే చాలా నిరాడంబరంగా ప్లాన్ చేశారు.. అని ముందుగా ప్రకటించారు. తీరాచూస్తే ఆరోజు ఆడంబరాలకు, ఆర్భాటాలకు కొదువ లేదు. పుష్కలంగా నిధులు వృథా చేశారన్నది వాస్తవం.
ఇలా చంద్రబాబునాయుడు తనచేతుల మీదుగా వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేసేస్తూనే.. ప్రజలు మాత్రం అద్దెలు పెంచుతున్నారంటూ అక్రోశించడం ఏం సబబు? అని జనం ప్రశ్నిస్తున్నారు. జనం లాభపడే అద్దెలకు కోతపెట్టడం ద్వారా రాజధానికి నిధులు పోగేయాలన్నట్లుగా, రాజధాని నిధులతో సమానంగా జనం అద్దెల్లో దండుకున్నట్లుగా చంద్రబాబు భావన ఉన్నట్లు ఆయన మాటలు ఉన్నాయి. అందుకే జనం.. ఎన్ని గడ్డిపోచలు కాలిస్తే బొగ్గులు అవుతాయి చంద్రబాబూ అని ప్రశ్నిస్తున్నారు. ఎందరు అద్దెల్లో స్వాహాచేస్తే.. తాము చేయగలిగినంత కోట్లలో వృథాకు ఈక్వల్ అవుతుందో చెప్పండి అంటూ జనం అడుగుతున్నారు!!