సీఎం రమేష్ చేస్తున్న దీక్షపై వెటకారం కామెంట్లు చేసిన మురళీమోహన్ వీడియో… సోషల్ మీడియాలో హైలెట్ అయింది. తెలుగుదేశం పార్టీపై వైసీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలు వీడియో సాయంతో ఓ రేంజ్లో దాడి చేశారు. అసలు ఈ వీడియో ఎలా బయటకు వచ్చిందన్నది ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిన సందేహం. ఎంపీలు మాట్లాడుకున్నది.. ఆంధ్రప్రదేశ్ భవన్లో. అక్కడ ఎంపీలు కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. మీడియావాళ్లు లేనే లేరు. కానీ వారి దృశ్యాలు బయటకు వచ్చాయి. ఆడియోతో సహా వచ్చేశాయి. ఎలా వచ్చాయన్నది టీడీపీ నేతలకు తెలియకుండా ఉండదు…!
ఎంపీలు మాట్లాడుకునే సమయంలో వారికి తెలియకండా సెల్ ఫోన్లో షూట్ చేసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టారు. నిజానికి ఏపీ భవన్లో ఆ సమయంలో ఎంపీల దగ్గర ఎవరున్నారో.. ఫోన్‌తో ఏ మూల నుంచి షూట్ చేశారో.. ఈజీగా తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు ఈ విషయంలో… పూర్తి స్థాయి ఆధారాలతో సహా ఆ ఇంటిదొంగను పట్టుకోవాలని డిసైడయ్యారు. ఎంపీల దగ్గర టీడీపీ నేతలు తప్ప ఎవరూ లేరని ..చంద్రబాబుకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. సోషల్ మీడియాలో పెట్టిన వారు ఎవరో వెంటనే తెలుసుకోవాలని ఢిల్లీలో ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ కార్యాలయాన్నిపార్టీ అగ్రనేతలు ఆదేశించారు. పార్టీలో ఉంటూ పార్టీకి ద్రోహం చేయడమేమిటని చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
చంద్రబాబుతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన నేతలు కొంత మంది మాత్రం విజువల్స్ షూట్ చేసి బయటకు విడుదల చేయడం ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, యాధృచ్చికంగా జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అంటే.. టీడీపీలో ఓ స్థాయి ఉన్న నేతే ఈ పని చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్పష్టమైన ఆధారాలతో నివేదిక వచ్చిన వెంటనే ఎంతటి వారైనా సరే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరికలు జారీ చేయడంతో టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.