తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైకాపా ఫేక్ పార్టీ అనీ, ఫేక్ ఫొటోలూ వీడియోలతో ఉన్నది లేనట్టుగా ప్రచారం చేసుకుంటున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీగా వారు చేస్తున్న రాజకీయమంతా ఫేక్ అని దుయ్యబట్టారు. ఈనెల 20న తాను చేపట్టనున్న దీక్షకు సంబందించి ఏర్పాట్లపై కూడా చర్చించారు. అదే రోజున అన్ని నియోజక వర్గాల్లోనూ, జిల్లా కేంద్రాల్లోనూ టీడీపీ నేతలు కూడా కేంద్రం తీరుపై నిరసనగా దీక్షలు చేయాలని నిర్ణయించారు.
ఇకపై టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లి.. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాల అంశమై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టడంతోపాటు… టీడీపీ చేసిన అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. ఈనెల 21 నుంచి అన్ని నియోజక వర్గాల్లోనూ సైకిల్ యాత్రలు చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రం చేస్తున్న కుట్ర రాజకీయాలకు ప్రతిపక్ష వైకాపాతోపాటు, జనసేన ఏ విధంగా వంతపాడుతోందనే అంశంపై ప్రధానంగా ప్రజలకు వివరించాలని సూచించారు. దేశవ్యాప్తంగా భాజపాకి వ్యతిరేకత మొదలైందనీ, ఏపీలో భాజపాకి ఒక్క సీటూ వచ్చే పరిస్థితి లేదనే అంశాన్ని కూడా మరోసారి ఈ భేటీలో చంద్రబాబు ప్రస్థావించినట్టు సమాచారం.
ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టు… హోదా అంశంపై అధికార పార్టీగా టీడీపీ పోరాటం సాగించడం ఒక సవాలే. ప్రత్యేక హోదాపై ఇకపై ఎలాంటి పోరాటం సాగించాలి, ఇదే సమయంలో.. చేసిన అభివృద్ధిని ఏ విధంగా చెప్పుకోవాలనే సవాళ్లపైనే ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. హోదా హీట్ ఇప్పుడుంది కాబట్టి… కేవలం అదే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా కేంద్రం చేసిన అన్యాయాన్నీ, ప్రతిపక్షం చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలకు వివరించొచ్చు. కానీ, హోదా ఒక్కదానిపైనే ఫోకస్ చేస్తే… నాలుగేళ్లపాటు టీడీపీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు చెప్పుకోలేని పరిస్థితి రావొచ్చు. కాబట్టి, ఈ రెండు అంశాలను బేలన్స్ చేసుకుంటూ… త్వరలో చేపట్టబోతున్న సైకిల్ ర్యాలీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇలా అంశాలవారిగా భవిష్యత్తులో ఒక్కో కార్యక్రమం చేపట్టాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు అర్థమౌతోంది.