వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జగన్మోహన్ రెడ్డి.. ఎంత అవినీతికి పాల్పడ్డారో.. ఎక్కెడెక్కడ ఆస్తులు కూడబెట్టారో వివరిస్తూ.. తెలుగుదేశం పార్టీ ఓ పుస్తకం ముద్రించింది. అది హాట్ టాపిక్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అవగానే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా.. రివెంజ్ తీర్చుకోవడం ప్రారంభించింది. అవినీతి చక్రవర్తి పేరుతో ఓ పుస్తకాం.. మొదటి ఏడాది నుంచి అచ్చేస్తోంది. ఏడాదికి రూ.లక్షా యాభైవేల కోట్ల రూపాయల అవినీతిని జోడించుకుంటూ వస్తున్నారు. నాలుగేళ్లయింది కాబట్టి… ఇప్పుడది ఆరు లక్షల కోట్లకు దాటి పోయింది. పైకి..మరో పదిహేడు లక్షల కోట్లు కూడా అయింది.. బహుశా.. అది జీఎస్టీ కావొచ్చు. ఇలా అప్ డేట్ చేసిన పుస్తకాన్ని విడుదల చేశారు కూడా.
చాలా మందికి అనుమానం వస్తుంది… అసలు రాష్ట్ర బడ్జెట్ ఎంత..? నాలుగేళ్లలో రాష్ట్ర బడ్జెట్ ఎంత..?. ఒక వేళ బడ్జెట్ మొత్తం… చంద్రబాబు తన సొంతం చేసుకున్నా… ఆ మాత్రం అవినీతి చేయగలరా..? అని..! అలాంటి సందేహాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఆరు లక్షల కోట్లు దాటలేదు. అయినప్పటికీ.. చంద్రబాబు.. ఆరు లక్షల కోట్లు ప్లస్ జీఎస్టీ అవినీతి చేశారు. కావాలంటే.. అవినీతి చక్రవర్తి అప్ డేటెడ్ పుస్తకంలోచూడొచ్చు. అందులో ఆధారాలు కూడా ఉన్నాయట. ఆధారాలు అంటే.. జీవోలు.. సాక్షి పత్రికలో వచ్చిన కథనాలన్నమాట. వాటినే ఆధారాలుగా పరిగణించాల్సి ఉంటుంది.
పుస్తకంపై టైటిల్ చూడగానే చాలా మందికి ఓ అనుమానం వస్తే… అంత పక్కాగా అవినీతి చేసినట్లు… రూ. 6,17,585.19 కోట్లు .. అదీ కూడా… చివరిగా .. చుక్క పెట్టి… 19 లక్షలు అని చెప్పడం ఎందుకు..? అంత పక్కా సమాచారం.. వైసీపీ దగ్గర ఉందా..? అన్నదే ఆ డౌట్. ఆ డౌట్ వైసీపీనే తీర్చాలి. ఈ పుస్తకాన్ని తీసుకెళ్లి రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి, ఎంపీలకు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, గవర్నర్లకు, అన్ని దర్యాప్తు సంస్థలకు అందజేయనున్నారట. మరి అన్ని ఆధారాలున్నాయి కాబట్టి.. చంద్రబాబు చిక్కులు తప్పవేమో..?