బీజేపీకి వ్యతిరేకంగా… కాంగ్రెస్కు అనుకూలంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడంలో.. చంద్రబాబు మార్క్ రాజకీయం సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ… కాంగ్రెస్ తో పాటు కూటమి కట్టడానికి వెనుకడుగు వేస్తున్న పార్టీలు.. ఇప్పుడు మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి వ్యతిరేకంగా.. ఓ కూటమిగా ప్రజల ముందు ఉండాలంటే.. రాష్ట్రపతి నుంచి ముందుగా ఆహ్వానం అందాలంటే.. కచ్చితంగా… ఫలితాలకు ముందే.. సమావేశం కావాలన్న చంద్రబాబు… సంకల్పానికి… పార్టీలన్నీ దాదాపుగా అంగీకారం తెలిపాయి. మూడు రోజులుగా ఢిల్లీలో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు… మాయావతి, అఖిలేష్లను… భేటీకి వచ్చేలా అంగీకరింప చేసినట్లు… టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
శనివారం . లక్నో వెళ్లి… మాయావతి, అఖిలేష్లతో భేటీ అయిన… చంద్రబాబు… ఫలితాలకు ముందే అన్ని విపక్షాల పార్టీల భేటీకి వచ్చేందుకు అంగీకరించేలా చేయగలిగారు. అయితే కొన్ని షరతులు పెట్టారు. ఆ షరతులను… రాహుల్ గాంధీ, శరద్ పవార్లకు చంద్రబాబు వివరించారు. విపక్షాల కూటమి భేటీకి.. కాస్త తగ్గి అయినా ఉండటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాంతో… కాంగ్రెస్ పార్టీ స్పందనను… చంద్రబాబు… ఎస్పీ, బీఎస్పీలకు తెలియజేయనున్నారు. ఈ సందర్భంగానే… విపక్షాల భేటీ తేదీ, సమయం బయటకు రానుంది. కుదిరితే.. 21న లేదా.. 22వ తేదీన సమావేశం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు.
సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, మమతా బెనర్జీలు… విపక్షాల కూటమి భేటీకి వస్తే… దాదాపుగా ఫలితం తేలిపోయినట్లేనన్న అభిప్రాయం ఇప్పటికే రాజకీయ పార్టీల్లో ఉంది. ప్రధానమంత్రి పదవి విషయంలో అన్ని పార్టీలు.. ఏకాభిప్రాయానికి రావడానికి చంద్రబాబు ఓ ఫార్ములా ప్రతిపాదించారని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 140కిపైగా సీట్లు వస్తే ఆ పార్టీకి.. లేకపోతే.. ప్రాంతీయ పార్టీల నుంచి ఓ అభ్యర్థికి మద్దతివ్వాలన్న ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ ఓకే అన్నదని చెబుతున్నారు. అయితే… ప్రాంతీయ ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంలో తమ అభిప్రాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇవన్నీ.. సమావేశం అయి… ఐక్యత చాటిన తర్వాత చర్చించుకుదామని… చంద్రబాబు ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. విపక్షాల కూటమి భేటీకి.., మాయావతి, అఖిలేష్ , మాయావతి వచ్చేలా చేయగలిగితే.. చంద్రబాబు… చక్రం తిప్పినట్లే భావించాలి..!