ఓట్లీ చీలనివ్వబోమని అయితే కలిసి రావాలనుకున్న వాళ్లు త్యాగాలకు సిద్దపడాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు రిప్లయ్ పంపారు. ఎలాంటి త్యాగాలకైనా సిద్దంగా ఉన్నామని బహిరంగ ప్రకటన చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసం తీవ్రవాదులతో పోరాడుతున్నామని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. అందరూ కలిసి ప్రజా ఉద్యమం చేద్దామని.. ఉద్యమానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే త్యాగాలకూ సిద్ధమని ప్రకటన చేశారు.
అందరూ కలిసి రావాలని.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు చేసిన కామెంట్లే ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పార్టీ ఆవిర్భావ సభ నుంచి ప్రభుత్వంపై పోరాటానికి అందరూ కలవాలన్నారు. ఓట్లు చీలనీయబోమని ప్రకటించారు. ఆ సమయంలోనే రాజకీయ త్యాగాలు కూడా చేయాలన్నారు. చంద్రబాబు ఇప్పుడు ఆ దిశగా స్పందించినట్లుగా భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ – జనసేన పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికపోయే అవకాశం లేకపోగా.. సామాజికవర్గ సమీకరణాలు కూడా అనుకూలంగా మారుతాయని దాని వల్ల ప్రభుత్వాన్ని సులువుగా ఓడించవచ్చన్న విశ్లేషణలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉందని.. ఇలాంటి సమయంలో వ్యతిరేక ఓట్లు చీలికపోకూడనది పవన్ కల్యాణ్ అంటున్నారు. చంద్రబాబు కూడా ఇ్పపుడు అదే టోన్లో వాయిస్ వినిపించడంతో రెండు పక్షాల నుంచి సానుకూలత వ్యక్తమయినట్లుగా భావిస్తున్నారు. ఈ రెండు పార్టీలు తదుపరి అడుగులు వేయడానికి చాలా సవాళ్లు ఉన్నాయి. ఇప్పటికైతే కలసిపోరాటం చేయాలన్న ఆలోచన చంద్రబాబు చేసినట్లుగా కనిపిస్తోంది.