తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. నరేంద్రమోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. గురువారం.. రూ. లక్షా 70వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగానే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అభినందిస్తూ ఓ లేఖ రాసేశారు. కరోనాను సమర్థంగా డీల్ చేస్తున్నారని అభినందనలు తెలిపారు. వైద్య సిబ్బంది, రైతులు, పేదల కోసం కేంద్రం ప్రకటించిన సాయం… అద్భుతమన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ పరిస్థితి భిన్నంగా ఉంటుందని… ఎలాంటి ఉపద్రవం వచ్చినా.. దేశాన్ని కాపాడతారన్న నమ్మకం బీజేపీ నాయకత్వంపై ఉందన్నారు.. చంద్రబాబు. దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబెడతారన్న నమ్మకాన్ని లేఖలో చంద్రబాబు వ్యక్తం చేశారు.
పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు ఎక్స్గ్రేషియా ప్రకటించడం వంటి నిర్ణయాలను అభినందించకుండా ఉండలేకపోతున్నానని చంద్రబాబు అభినందించారు. మీ ప్రభుత్వం మానవత్వం గల ప్రభుత్వం అనడంలో ఎలాంటి సందేహం లేదని సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదే మొదటి సారి కాదు.. నరేంద్రమోడీ జనతా కర్ఫ్యూ ప్రకటించిన రోజున.. కూడా ప్రత్యేకంగా ప్రెస్మీట్ పెట్టి.. మోడీ సూచనలు పక్కాగా ఫాలో అవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పాలన, తెలివైన నిర్ణయాలు, విధానాల వల్ల దేశం కేవలం కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడమే కాకుండా మునుపటి ఆర్థిక స్థితిని కూడా త్వరలోనే అందుకోగలుగుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఒక్కసారిగా మోడీ సర్కార్ పై.. చంద్రబాబు ఇంత విశ్వాసం ప్రకటించడం.. రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. దీని వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని కొంత మంది అంటూంటే.. మరికొంత మంది మాత్రం.. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందని.. అందుకే చంద్రబాబు.. ఈ స్టాండ్ తీసుకున్నారని అంటున్నారు.