కేంద్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్కు రావలసిన ఆర్థిక సహాయం విషయంలో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ పాత బాణీకే మరులుతున్నారా? అప్పట్లో లేనిప్యాకేజిని ప్రశంసిస్తూ శాసనసభలో తీర్మానం చేయడమే గాక దాన్ని సాధించినందకు వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేశారు. తీరా ఏడాది గడిచినా ఏమీ రాలింది లేదని తేలిపోయింది. దాంతో ఇటీవలనే కొంచెం విమర్శనాత్మకంగా మాట్లాడ్డం మొదలెట్టారు. రావలసినదాంట్లో ఇచ్చింది కొంతేననీ, రెవెన్యూలోటు సరిగ్గా లెక్కకట్టలేదనీ వ్యాఖ్యానించారు.. పోలవరం విషయంలోనూ అలాటి అసంతృప్తినే వెలిబుచ్చారు. అయితే ఇది పైనున్న ప్రధాని మోడీకి నచ్చినట్టు లేదు. ఈ కారణంగానే తనకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వకుండా దూరం పెడుతున్నారని గ్రహించినవాడై చంద్రబాబు మళ్లీ పాత ఫక్కీని ఎత్తుకున్నారు.తాజాగా జాతీయ రహదారుల సముదాయం శంకుస్థాపన, పోలవరం పట్టిసీమ సందర్శనల సమయంలో మరోసారి కేంద్రాన్ని కీర్తించే పని మొదలుపెట్టారు. నితిన్ గడ్కరీ అనుకున్న పనిపూర్తి చేస్తారని ఈయన అంటే పోలవరం నా ప్రాజెక్టు అని ఆయన గొప్పలు పోయారు! కేంద్రం ఇప్పటికే చాలా ఇచ్చింది మిగిలింది కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి విన్నవించుకున్నారే తప్ప వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇక మంత్రి పదవి స్థానే ఉపరాష్ట్రపతి పీఠం అధిష్టించిన వెంకయ్యనాయుడు వల్ల జరిగిన మేలు గురించి షరా మామూలుగా పొగిడేశారు. ఆయనా అమితానందభరితుడై నా వల్ల కావలసిన సహాయం ఎప్పుడూ చేస్తానని హామీలు ఇచ్చారు. అన్నిటికంటే వింతేమిటంటే మోడీ మనసులో ఎపికి ఎప్పుడూ ప్రత్యేక స్థానముంటుందనీ ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువే చేస్తారనీ గడ్కరీ సెలవిచ్చారు. అదే నిజమైతే రాష్ట్రం ఇంతగా ఘోషించే అవసరం వుండేదా?