నారా చంద్రబాబునాయుడు మారిపోయాడు. చాలా చాలా మారిపోయాడు. కెసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా, ఖబడ్దార్ కెసీఆర్ అంటూ ఆవేశంగా రంకెలేసిన చంద్రబాబు ఇఫ్పుడు అస్సలు లేడు. నేను మారిపోయాను…మారిపోయాను అని చెప్పి చంద్రబాబు చాలా సార్లు చెప్పుకుంటూ ఉంటాడు. మిగతా విషయాల్లో తెలియదు కానీ కెసీఆర్ విషయంలో మాత్రం చంద్రబాబు పూర్తిగా మారిపోయాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా కనీసం కెసీఆర్ పేరు ఎత్తలేదు చంద్రబాబు. ఇక రీసెంట్గా తెలంగాణాలో జరిగిన మహానాడు సందర్బంగా కూడా పాత చరిత్రను వల్లెవేయడానికే పరిమితమయ్యాడు తప్ప కెసీఆర్ పేరు ఎత్తే సాహసం కూడా చేయలేదు చంద్రబాబు.
ఇఫ్పుడు విశాఖపట్నంలో జరుగుతున్న మహానాడు సందర్భంగా మరో అడుగు ముందుకు వేశాడు. ఉన్నత విద్యలో ఎపి, తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే ముందు వరుసలో ఉన్నాయని చెప్పాడు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని చెప్పుకొచ్చాడు చంద్రబాబు. అంటే తెలంగాణా కూడా అభివృద్ధిలో దూసుకుపోతుందని చాలా స్పష్టంగా చెప్పేసినట్టే. చంద్రబాబులాంటి అత్యంత అనుభవజ్ఙుడైన నేత నోటి నుంచి పొరపాటుగా ఇలాంటి మాటలు వచ్చాయంటే నమ్మడం కష్టం. ఓటుకు నోటు అయితేనేమి…వేరే కారణం అయితేనేమి కెసీఆర్తో కూడా పూర్తిగా కాంప్రమైజ్ అయిపోయాడు చంద్రబాబు. మామూలుగా అయితే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సఖ్యంగా ఉంటే ఆనందపడాల్సిన విషయమే కానీ రాష్ట్ర విభజన సందర్భంగా నష్టపోయిన ఎపికి ఇద్దరి సఖ్యత పుణ్యమాని మరికాస్త నష్టం జరుగుతూ ఉండడం మాత్రం బాధాకరమే. అలాగే తెలంగాణా రాష్ట్రంలో టిడిపిని కూడా ఫణంగా పెట్టేస్తున్నాడు చంద్రబాబు. 2019లో తెలంగాణాలో అధికారంలోకి వస్తాం అనే డైలాగ్ బాగానే ఉంది కానీ టిడిపి జాతీయ అధ్యక్షుడు అయిన చంద్రబాబే కెసీఆర్ పాలనను కనీస మాత్రంగా కూడా విమర్శించకపోగా ఇఫ్పుడిక తెలంగాణాలో అభివృద్ధి జరుగుతోంది అని చెప్పాక తెలంగాణా టిడిపి నేతలు కెసీఆర్ని ఎంత విమర్శిస్తే మాత్రం ఏం ఉపయోగం? మోడీ, కెసీఆర్ల విషయంలో చంద్రబాబు కాంప్రమైజ్ అవుతున్న విధానం ఆంధ్రప్రదేశ్లో తెలుగు తమ్ముళ్ళకు కూడా అంతగా రుచించని నేపథ్యంలో ముందు ముందు చంద్రబాబు వ్యవహారశైలి ఇంకా ఎన్ని మార్పులు వస్తాయో చూడాలి మరి.