తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు తనను బూచిగా చూపిస్తూ ప్రచారం చేస్తున్న కేసీఆర్కు గట్టి కౌంటర్లు ఇవ్వాలని చంద్రబాబునాయుడు నిర్ణయించుకున్నారు. ఖమ్మంలో సీతారామ ప్రాజెక్ట్, మహాబూబ్ నగర్ లో పాలమూరు ఎత్తిపోతల పధకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ కేసీఆర్ చేస్తున్న విమర్శలను తెలుగుదేశం సీరియస్ గా తీసుకుంది. వీటిపై స్టేటస్ నోట్ తయారు చేయడంతో పాటు, రెండు రాష్ట్రాల ప్రజలకు నిజాలు వివరించాలని చంద్రబాబు నిర్ణయించారు. చెప్పేందుకు చేసిన పనులు ఏమీ లేకపోవడం, ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత నేపధ్యంలో కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే భావనలో టీడీపీ నేతలు ఉన్నారు.
జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు రెండు విడతలుగా సమావేశమయ్యారు. తెలంగాణలో సీతారామ ప్రాజెక్ట్, పాలమూరులో ఎత్తిపోతల పధకం, స్టేటస్ నోట్ లు ఇవ్వాలని ఆదేశించారు. కేంద్ర జలవనరుల శాఖ నుంచి, ట్రిబ్యునల్ కు లోబడి అన్ని అనుమతులు తీసుకున్నాకనే ప్రాజెక్ట్ లు నిర్మించాలని తాము కోరిన విషయాన్ని చంద్రబాబుకు ఈ సందర్భంగా జలవనరుల శాఖ అధికారులు వివరించారు. ప్రాజెక్ట్ లను నిలిపివేయాల్సిందిగా కేంద్రానికి లేఖ రాయలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో పలు ప్రాజెక్ట్ లు ప్రారంభించనప్పటికీ, వాటిలో దేనిని పూర్తి చేయలేకపోయారని జలవనరుల శాఖ అధికారులు చంద్రబాబుకు చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రమైనప్పటికీ ప్రాధాన్యతలు లోపించడంతో నాలుగున్నర సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఏ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. దీన్నే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా ప్రస్తావించాలనుకుంటున్నారు. ఏపీలో రహదారులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పర్యటనలు, గృహ నిర్మాణాలను లక్ష్యాల మేరకు పూర్తి చేయడం, రాష్ట్రంలో సిమెంట్ రోడ్లను నరేగా నిధులు ఉపయోగించుకుని దేశంలో అత్యధికంగా నిర్మించడం వంటి అంశాలను కూడా తెలంగాణా ఎన్నికల ప్రచారంలో తాను ప్రజలందరికీ వివరిస్తానని చంద్రబాబు చెబుతున్నారు.
తెలంగాణలో ఎమ్మెల్యేల తీవ్ర వ్యకతిరేకత కనిపిస్తోంది. రోజురోజుకి పడిపోతున్న గ్రాఫ్ కారణంగా కేసీఆర్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారనేది చంద్రబాబు అభిప్రాయం. తెలంగాణ ప్రచార తేదీలపై నేడో రేపో నిర్ణయం తీసుకునే అకాశం ఉంది. గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుందని, ఇక ప్రచారాన్ని ప్రారంభిద్దామని కూడా తెలంగాణ తెలుగుదేశం నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు. ఈ మేరకు వారు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. ఇక… చంద్రబాబు రంగంలోకి దిగితే.. కేసీఆర్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లుగా సమరం సాగనుంది.