ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఏపీకి కేంద్రం నుంచి సాయం అందాల్సిన ఆవశ్యకతను, ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఏపీకి ఇచ్చిన హామీల గురించి జాతీయ మీడియాకి వివరించారు. రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు కలిగిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పారు. ఈ సందర్భంగా నెల్లూరు, తిరుపతి సభల్లో మోడీ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ చేసిన వాగ్దానాల వీడియోలను చూపించారు. అమరావతి శంకుస్థాపన సమయంలో కూడా ప్రధాని మోడీ ప్రసంగంలోకి కొన్ని క్లిప్పింగులను ప్రదర్శించారు. విభజన చట్టంలోని హామీలను తు.చ. తప్పకుండా పాటిస్తామని ప్రధాని చెప్పారనీ, కానీ ప్రస్తుత పరిస్థితి మరోలా మారిందని వివరించారు.
కేంద్రంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి చాలా రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయన్నారు. ఏపీ ప్రజలకు కేంద్రం సమాధానం చెప్పాల్సి ఉందనీ, అందుకే అవిశ్వాసం పెట్టామని చెప్పారు. విభజన చట్టంలో ఉన్నవి, ప్రధానమంత్రి స్వయంగా ఇస్తానని చెప్పినవి మాత్రమే అడుగుతున్నామనీ, అంతకుమించి ఎక్కువ ఏమీ అడగడం లేదన్నారు. రాష్ట్రాల పట్ల కేంద్రం బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, అంతేగానీ రాష్ట్రాలను సమస్యల్లోకి నెట్టే విధంగా ఉండకూడదని చంద్రబాబు హితవు పలికారు. ప్రతిపక్ష వైకాపా తీరును ఉద్దేశించి విమర్శలు చేస్తూ… తాను ఢిల్లీ వచ్చింది రాజకీయాలు చేయడానికి కాదని చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా ఆడుతున్న నాటకాలను ఆంధ్రా ప్రజలు గమనిస్తున్నారన్నారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుని ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని ప్రధానమంత్రి కార్యాయలంలోకి అనుమతిస్తున్నారంటూ విమర్శించారు. విభజన చట్టంలో ఉన్న అంశాల అమలుపై తాము పోరాటం కొనసాగిస్తామని మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా ఇవ్వొద్దంటూ 14వ ఆర్థిక సంఘం చెప్పడం అబద్ధమనీ, ఏపీకి హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు కూడా నీతీ ఆయోగ్ సిఫార్సుల మేరకే నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని చెప్పారు. ఎప్పటికప్పుడు అన్ని యూసీలూ కేంద్రానికి ఇస్తున్నామనీ, కానీ వీటి విషయంలో రాష్ట్రాన్ని తప్పుబడుతోందని చంద్రబాబు వివరించారు. విభజన తరువాతి నుంచి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలూ.. అమలుకాని కేంద్ర హామీలు గురించి స్పష్టంగా వివరించారు. ఇక, ఈ ప్రెస్ మీట్ పై వైకాపా విమర్శలే తరువాయి! పోరాటం అంటే ఇది కాదని అంటారేమో..? ఢిల్లీలో ఇన్నాళ్లుగా మకాం వేసి ఉంటున్న వైకాపా ఏపీ వాస్తవ పరిస్థితి ఇలా వివరించే ప్రయత్నం ఎన్నడూ చెయ్యలేదు. అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తూ, మర్నాడు పీఎంవోలో హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. పార్లమెంటులో వివిధ పార్టీల నేతల్ని చంద్రబాబు కలిస్తే.. అబ్బే, ఎవ్వరూ ఆయన్ని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు.. చంద్రబాబు ప్రెస్ మీట్ గురించి ఎలాంటి వ్యాఖ్యల చేస్తారో చూడాలి.