రాష్ట్రాన్ని కేంద్రంలోని భాజపా సర్కారు అన్ని రకాలుగా మోసం చేసిందని మరోసారి విమర్శించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన గ్రామదర్శిని సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ వైకాపాతోపాటు, జనసేన భాజపాలపై విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఈ మధ్యనే ఒక తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడనీ, అలాంటి పనులు చెయ్యొద్దనీ, ఆ అవసరం కూడా లేదనీ, పోరాడి సాధించుకుదాం అన్నారు. అవసరమైతే భాజపాని ఎన్నికల్లో ఓడించి ప్రత్యేక హోదా సాధించుకుందామని ముఖ్యమంత్రి చెప్పడం గమనార్హం!
రాష్ట్రంలో భాజపాకి ఒక్క సీటు కూడా రాదనీ, కానీ రాష్ట్రంలోని దొడ్డిదారుల ద్వారా వస్తున్నారన్నారు సీఎం. ఆ దారులే ప్రతిపక్ష పార్టీ వైకాపా, జనసేనలు అన్నారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ, గడచిన నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి భాజపా సహకారంతో కాదన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నదంతా స్వశక్తితో, కష్టార్జితంతో చేసుకుంటున్నదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 2800 కోట్లు బకాయిలు కేంద్రం ఇవ్వాలనీ, ఇంకా డీపీఆర్ ఫైనలైజ్ చెయ్యలేదన్నారు. కానీ, ఆర్థిక లోటు పాట్లు ఉన్నా కూడా పోలవరం విషయంలో ముందుకుపోతున్నామన్నారు. ఒడిశా అభ్యంతరం లేదని చెప్పినా విశాఖ రైల్వేజోన్ ఇవ్వడం లేదని అంటున్నారన్నారు. ప్రతీ శుక్రవారం కోర్టుకెళ్లి వచ్చి, అక్కడ చేతులు కట్టుకుని నిలబడి, బయటకి వచ్చి నన్ను విమర్విస్తారు ఇదెక్కడి న్యాయం అంటూ జగన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి నాయకుడున్న పార్టీ మద్దతుతో ఏదో చెయ్యాలని భాజపా అనుకుంటోందనీ, అది అసాధ్యమని ముఖ్యమంత్రి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు, లోక్ సభ సీట్లను కూడా గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. మనం అనుకున్న వ్యక్తి ప్రధాని కావాలంటే, రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. అప్పుడు, అన్ని రాజకీయ పార్టీలతో కలిసి, రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూసుకుంటామన్నారు. తన ఆలోచన పదవుల కోసం కాదనీ, 1995లోనే ప్రధాని అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం కాదన్నానని చెప్పారు. నాలుగేళ్ల శ్రమ ఫలితంగా ఇప్పుడిప్పుడే ఫలితాలు రావడం మొదలైందనీ, దీన్ని కొనసాగించడం కోసం అందరూ సమష్టిగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు.
భాజపాని ఓడించి హోదా సాధిద్దామని సీఎం ప్రకటించడం ప్రత్యేకంగానే చూడాలి. ఎందుకంటే, ఇప్పటికే కాంగ్రెస్ కు టీడీపీ మద్దతు ఉంటుందా అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భాజపాకి ప్రత్యామ్నాయానికే కేంద్రంలో మద్దతు అని చెప్పినట్టుగా భావించొచ్చు. అదే సమయంలో… ఎన్నికల తరువాత జాతీయ స్థాయిలో అన్ని పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తామని… ప్రధాని అభ్యర్థిని నిర్దేశించి స్థాయిలో టీడీపీ ఉండాలని ఆకాంక్షించారు. దీని ద్వారా అర్థమౌతున్నది ఏంటంటే… కేంద్రంలో టీడీపీ చూస్తున్న భాజపా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదనీ, కూటమి కావొచ్చనే అభిప్రాయం కూడా కలుగుతోంది!