హైకోర్టు విభజన తో జగన్ కేసుల పై ప్రభావం పడుతుందా..?. సీబీఐ కోర్టుకు హైకోర్టుకు సంబంధం ఏముంది..? సీబీఐ కోర్టు.. సీబీఐ కోర్టే కదా.. అని అందరికీ అనిపించవచ్చు. కానీ హైకోర్టుతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ కేంద్రం సంప్రదింపులు జరపలేదని అసంతృప్తి వ్యక్తం చేసారు. సమయం ఇవ్వకుండా జనవరి1 కల్లా వెళ్లిపోవాలి అనడం సరికాదన్నారు. ఇలా ఎందుకు చేశారన్నదానిపై చంద్రబాబు భిన్నమైన విశ్లేషణ చేశారు. హైకోర్టు విభజనతో నాంపల్లి సీబీఐ కోర్టు విభజన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల జగన్ కేసులకు సంబంధించిన విచారణ మళ్లీ ప్రారంభించాల్సి వస్తుందని… ఆ దృష్టితో కూడా విభజన చేసినట్టుగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనతో నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని… ఇప్పుడా ప్రక్రియ మళ్లీ ప్రారంభించాల్సిందేనన్నారు. జగన్ కేసులో వాదనలు జరగకపోయినా న్యాయ ప్రక్రియ ముగిసిందని గుర్తు చేశారు.
హైకోర్టు విభజన వ్యవహారం మొత్తం ఇప్పటి వరకూ ఒక వైపు అందరూ చూశారు. చంద్రబాబు మాత్రం… రెండో వైపు చూశారు. హైకోర్టు పరిధిలోని న్యాయాధికారులను కూడా బదిలీ చేశారు. ఈ క్రమంలో… నాంపల్లి కోర్టు జడ్జి కూడా బదిలీ అవుతారని చంద్రబాబు చెబుతున్నారు. అంటే.. చంద్రబాబు చెప్పనట్లు… నిజంగానే జగన్ కేసులు మొదటి నుంచి మళ్లీ విచారణ జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ కేసు విషయంలో ఇప్పటికే వివిధ కారణాల రీత్యా చాలా ఆలస్యం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈడీ దూకుడుగా వ్యవహరించి.. కొన్ని ఆస్తులు జప్తు చేసినప్పటికీ.. ఆ తర్వాత బీజేపీతో వైసీపీ సన్నిహిత సంబంధాలు ఏర్పడిన తర్వాత నెమ్మదించిందనే విమర్శలు టీడీపీ వైపు నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నాయి. ఈడీ అటాచ్ చేసిన కొన్ని ఆస్తులను కేంద్రం ప్రత్యేక ఆదేశాల ద్వారా విడిపించిందని సాక్షాత్తూ చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో బయటపెట్టారు.
హైకోర్టు విభజన అనివార్యమే అయితే.. రాష్ట్రపతి నోటిఫికేషన్ తర్వాత కనీసం మూడు నెలల గడువు ఇవ్వడం ఆనవాయితీ. ఈ సారి అలాంటి ప్రస్తావనే లేదు. ఐదు రోజుల ముందు నోటిఫికేషన్ ఇచ్చి ఒకటో తేదీ నుంచి ఏపీలో హైకోర్టు ప్రారంభించాలని ఆదేశాలిచ్చారు. కేసీఆర్ ప్రధానితో భేటీ అయిన అరగంటలోనే ఈ గెజిట్ విడుదల కావడంపై.. అందరిలోనూ ఆశ్చర్యం వ్యక్తం అయంది. ఈ తరుణంలో చంద్రబాబు.. జగన్ కేసుల కోణాన్ని బయటపెట్టడం కలకలం రేపుతోంది.