ప్రభుత్వంపై ప్రజాపోరాటాలకు కలసి రావాలని పిలుపునిచ్చాను కానీ పొత్తుల గురించి మాట్లాడలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తన మాటలను వక్రీకరించారని ఆయన అన్నారు. తాను అననిమాటల్ని అన్నట్లుగా ప్రసారం చేయడం సాక్షి మీడియాకు అలవాటైపోయిందని మండిపడ్డారు. భీమిలీలో జై బాబు అని టీడీపీ కార్యకర్తలు నినాదాలు ఇస్తే మార్ఫింగ్ చేసుకుని జై జగన్ అన్నట్లుగా చెప్పుకున్నారని .. కలసి పోరాటం చేసే విషయంలో తన వ్యాఖ్యలను కూడా వక్రీకరించారని అంటున్నారు.
చంద్రబాబు పొత్తులపై నిజంగానే ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన ప్రభుత్వంపై ప్రజాపోరాటాలకు కలసి రావాలని ఇతరపార్టీలను కోరారు. టీడీపీ నేతృత్వంలో ప్రజాపోరాటం నిర్వహిద్దామన్నారు. అవసరమైతే తాను త్యాగాలకు సిద్ధమన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలు పొత్తుల కోసం అన్నట్లుగా ప్రచారం జరిగింది. రాజకీయాల్లో నేరుగా ఎవర చెప్పరు. ఇలాంటి ఇండైరక్ట్ వ్యాఖ్యల ద్వారానే వెళ్తాయి. తాము అనుకున్న ఎఫెక్ట్ వచ్చినా .. రాకపోయినా తన మాటల అర్థం అది కాదని తర్వాత మాట మార్చేస్తారు.చంద్రబాబు కూడా అలాగే చెబుతున్నారు.
చంద్రబాబు మాటలకు పవన్ స్పందించడం.. కలసి నడిచేందుకు.. ఓట్లు చీలకుండా ఉండేందుకు తాను సిద్ధమని ప్రకటించడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే అది ఇప్పుడు జరగకూడదన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.ఎన్నికలకు ముందు పొత్తులు పెట్టుకుంటేనే ఎఫెక్టివ్‌గా ఉంటుందని భావిస్తున్నట్లుగా ఉంది. మొత్తంగా చంద్రబాబు నెగెటివ్‌గా స్పందించినా… రెండు పార్టీల మధ్య ఉన్న ఐస్ మాత్రం బ్రేక్ అయిపోయిందని భావిస్తున్నారు.