రిపబ్లిక్ టీవీ ఆర్నాబ్ గోస్వామి నేతృత్వంలో నడుస్తోంది. ఆయన బీజేపీకి ఎంత దగ్గరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓ సదస్సు పెట్టి చంద్రబాబును వర్చవల్ సమావేశానికి ఆహ్వానించారు. అందులో ఇంట్రో చూసి చంద్రబాబును ఆ స్థాయిలో ఇప్పటి వరకూ ఎవరూ పొగడలేదని అనుకోవడం సహజం. చంద్రబాబు కూడా అధికారం లేనప్పుడు ఇలాటి క్లాసీ ఇంట్రో విని ఉండరు. తర్వాత ఆయన ప్రసంగమూ అంతే సాగింది. దేశం కోసం తాను చెప్పాల్సినదంతా చెప్పారు. రాజకీయాలకు వచ్చే సరికి నిర్మోహమాటంగా మోదీని సమర్థించారు.
ఎన్డీఏలో మళ్లీ చేరుతారా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని తేల్చేశారు. నిజానికి ఎన్డీఏలో చేరుతారా లేదా అన్నది చెప్పడానికి అది సరైన వేదిక కాదు. అలా చెబుతారని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ ఎన్డీఏలో చేరడానికి ఓ రూట్ మ్యాప్ రెడీ అయిపోయిందని అనుకోవచ్చు. బీజేపీకి వైసీపీ దగ్గరగా ఉంటుంది. కానీ అది అవసరాలకే. రేపు ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ కూటమికి తమ సీట్లు అధికారానికి ఉపయోగపడతాయి అనుకుంటే వైసీపీ నిస్సంకోచంగా కాంగ్రెస్ వైపు వెళ్లిపోతుంది. రాహుల్ ని ప్రధాని చేయడమే తమ తండ్రి లక్ష్యమని చెబుతుంది. ఎందుకంటే బీజేపీతో నేరుగా వైసీపీ పొత్తు పెట్టుకోదు.
టీడీపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే నేరుగా ఎన్డీఏలో చేరవచ్చు. కానీ చేరుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు ఆయన బీజేపీతో శతృత్వం కానీ మితృత్వం కానీ కోరుకోవడం లేదు. న్యూట్రల్ గా ఉండాలనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలు ఫెయిర్ గా జరగాలంటే బీజేపీ సపోర్ట్ ముఖ్యమనుకుంటున్నారు. అందుకే మోదీ విషయంలో చంద్రబాబు ఇంత సానుకూలత ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు. అంతే కానీ నేరుగా ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరే చాన్స్ లేదని అంటున్నారు. జనసేన పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తే చాలనుకుంటున్నారు.