అన్ని నదులను అనుసంధానం చేసి 2కోట్ల ఎకరాలకు సాగునీరివ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కడా సమస్య రాదన్నారు. సహజ వనరులు- జల వనరుల నిర్వహణపై చంద్రబాబు ఐదో శ్వేతపత్రం విడుదల చేశారు. నీటి కొరత ఉన్నప్పుడే దాని విలువ తెలుస్తుందన్నారు. పంటకుంటలు, గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేశామని.. చెక్ డ్యాములు నిర్మించాం, నదుల అనుసంధానం చేపట్టామని.. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు తీసుకువస్తే… కృష్ణా జలాలను రాయలసీమకు తరలించామని ప్రకటించారు. భవిష్యత్లో నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. గోదావరి-కృష్ణా అనుసంధానంతో పవిత్రసంగమం చేశామని.. వంశధార-నాగావళి-గోదావరి-కృష్ణా-పెన్నా నదుల… మహాసంగమం చేపడతామన్నారు.
సోమశిల వరకు ఎత్తిపోతల ద్వారా నీటిని తరలిస్తే…తిరుపతికి గ్రావిటీ ద్వారా సరఫరా చేయొచ్చన్నారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మార్చాలనేది లక్ష్యమని ప్రకటిచారు. జలవనరులు సమర్ధంగా వినియోగించుకునేందుకు…సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని 2029 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం సాధించడమే లక్ష్యమన్నారు. 2022 నాటికి 40% పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
సాంప్రదాయేతర ఇంధన వనరులను వాడుకుంటే కాలుష్యం తగ్గుతుందని.. సోలార్ పవర్ వల్ల ఖర్చు, వనరులు ఆదా అవుతాయన్నారు. 15 లక్షల విద్యుత్ పంపుసెట్లను సోలార్ పంపుసెట్లుగా మార్చబోతున్నామని.. ఎలక్ట్రిక్ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో వాయు కాలుష్యం సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. పర్యావరణ కాలుష్యం తగ్గితే ప్రజల ఆరోగ్యం బాగుంటుందన్నారు.
సేంద్రీయ సాగు వల్ల మేలురకమైన ఆహారం లభిస్తుందిని 2024నాటికి వ్యవసాయమంతా సేంద్రీయమే అవుతుందని ధీమా వ్యక్తం చేసారు. ఏపీలో కార్బన్డయాక్సైడ్ తగ్గించి… ఆక్సిజన్ పెంచేందుకు… సేంద్రీయ వ్యవసాయన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. మైక్రో ఇరిగేషన్లో ఏపీ నెంబర్వన్ స్థానంలో ఉందని… మైక్రో ఇరిగేషన్లో తొలి 10 జిల్లాల్లో 6 ఏపీ నుంచే ఉంటాయన్నారు.