ఆంధ్రప్రదేశ్ లో మానవ వనరుల అభివృద్ధికి నాలుగున్నరేళ్లలో తీసుకున్న చర్యలన్నీ సత్ఫలితాలిచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మానవవనరుల అభివృద్ధిపై ఆయన ఆరో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్రానికి 11 ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చామని.. వీటి ద్వారారూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. విదేశీ సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్లో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. 16 వర్సిటీలకు గాను 10 విశ్వవిద్యాలయాలకు న్యాక్ గుర్తింపు రావడం గర్వకారణమని వ్యాఖ్యానించారు.
7అకాడమీలు, తెలుగు భాషాభివృద్ది సంస్థ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు . మానవవనరులు సద్వినియోగం చేసుకోకుంటే సమాజం ముందుకెళ్లదన్నారు. మానవవనరుల విలువను గుర్తించి ప్రాధాన్యత ఇచ్చామన్నారు.
తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. ఇంజినీరింగ్ కాలేజీలు, విద్యాసంస్థలు తీసుకురావడం వల్లే. హైదరాబాద్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. విభజన తర్వాత ఏపీలో విద్యాసంస్థలు లేని లోటు కనిపించిందని.. అందుకే నాలుగున్నరేళ్లలో విద్యాభివృద్ధిపై దృష్టిపెట్టామన్నారు. రాష్ట్రంలో నాలెడ్జ్ మిషన్ ఏర్పాటు చేసి… ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జ్ఞానభేరి వంటి కార్యక్రమాలతో చైతన్యం తెస్తున్నామని గుర్తు చేశారు. ప్రతిభగల విద్యార్థులను ప్రొత్సహించేందుకు.. విద్యార్ధులకు ప్రతిభ అవార్డులు ఇస్తున్నామన్నారు. పాఠశాలల్లో 1,217 వర్చువల్ క్లాస్‌లు..3,640 డిజిటల్ క్లాస్ రూములు ఏర్పాటు చేశామని.. కొత్తగా యోగా, కూచిపూడి క్లాసులు కూడా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఉపాధి హామీ నిధులతో స్కూళ్లకు ప్రహరీగోడలు నిర్మించామని ప్రకటించారు.అన్ని కాలేజీలకు వైఫై సదుపాయం కల్పించి … 46 డిగ్రీ కాలేజీలు, 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిజిటల్ క్లాస్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని … దేశంలో ఎక్కడా లేనివిధంగా వైద్యరంగంలో 24 పథకాలు అమలులో ఉన్నాయన్నారు.
ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, ఎన్టీఆర్ వైద్య పరీక్ష..ఎన్టీఆర్ బేబీ కిట్స్, చంద్రన్న సంచార చికిత్స పథకాలు అమలు జరుగుతున్నాయని.. పేదవాళ్లకు ఉచితంగా డయాలసిస్‌తో పాటు రూ.2,500 పింఛన్ ఇస్తున్నామన్నారు. పదేళ్లలో రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని ఏపీలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానంపై నిబంధనను తొలగిస్తామని ప్రకటించారు.