ఆరో తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. ఆయన వచ్చేది రాజకీయ పర్యటన కోసం. గుంటూరులో సభ పెట్టి.. తాను చెప్పాలనుకున్నది చెబుతారు..? ప్రధానంగా ఆయన చెప్పాల్సింది.. ఏపీకి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు కాలేదని..? కానీ బీజేపీ నేతలు మాత్రం… అంత కంటే ఎక్కువగా ఏమలు చేశామని వాదిస్తున్నారు. నిజాలన్నీ ప్రజలకు తెలియజేయాలంటూ…చంద్రబాబు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇప్పటికి రెండు రంగాల్లో శ్వేతపత్రాలు విడుదల చేసి కేంద్రం తీరుపై మండి పడ్డారు. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పులేకపోతున్నారు. నీళ్లు నములుతున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించారు కాబట్టి… టీడీపీ నేతలు.. బీజేపీని మరింతగా టీజ్ చేస్తున్నారు.
నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ముందుగానే… ఏమిచ్చారో… చెప్పేలా… ఓ శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. కేంద్రం ఇస్తున్న నిధులతోనే ఏపీ నడుస్తోందని.. కన్నా లక్ష్మినారాయణ లాంటి వాళ్లు పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… శ్వేతపత్రం విడుదల చేయడం వారికి పెద్ద విషయం కాదు. కానీ టీడీపీ నేతల సవాళ్లపై వారు స్పందించడం లేదు. రైల్వేజోన్ నుంచి ఉక్కు ఫ్యాక్టరీ వరకూ… లోటు భర్తీ నంచి ప్రత్యేకహోదా వరకూ… చెప్పాల్సినవి శ్వేతపత్రంలో చాలా ఉంటాయి. అలాగే.. వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇచ్చి వెనక్కి తీసుకున్న విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. యుటిలిటీ సర్టిఫికెట్లు లేవంటూ… బీజేపీ నేతలు రాజకీయ ఆరోపణలు చేసినా..నీతి ఆయోగ్ కూడా అన్నీ సక్రమంగా ఇచ్చారని.. నిధులు విడుదల చేయాలని సిఫార్సు చేసింది. అయినప్పటికీ… కేంద్రం ఇంత వరకూ నిధులు విడుదల చేయలేదు.
అందుకే… ధైర్యం ఉంటే శ్వేతపత్రాలు విడుదల చేయాలంటూ… టీడీపీ స్వరం పెంచుతోంది. మరో వైపు … తమిళనాడు తరహాలో.. ప్రజల నిరసనలు ఎలా ఉంటాయో.. మోడీకి చూపించాలన్న పట్టుదలతో టీడీపీ ఉంది.ఇప్పటికే విద్యార్థి, ప్రజాసంఘాలు మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశాయి. ఆరో తేదీన రకరకాల నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. మండల స్థాయి నుంచి మరికొన్ని ప్రజాసంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. టీడీపీ కూడా… మోడీకి పోటీగా … నిరసనసభ నిర్వహించనుంది. మొత్తానికి మోడీ టూర్లో మరింత సెంటిమెంట్ పెంచేందుకు .. టీడీపీ పక్కా ప్రణాళికతో వెళ్తోంది.