ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అంటూ తాజాగా కొన్ని సర్వేలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి, ఈ సర్వేలను అధికార పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి, ఇప్పట్నుంచే ఎన్నికల ఫలితాలు ఇలా ఉంటాయనే అంచనాలు సరికాదు. పైగా, కొన్ని పార్టీలు ఈ సర్వేల ద్వారా కొంత హడావుడి సృష్టించాలనే ప్రయత్నమూ చేస్తుంటాయి! అయితే, తాజా సర్వేల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అసెంబ్లీ సమావేశాలకు గంట ముందు జరిగిన వ్యూహ కమిటీ భేటీలో ఈ అంశం ప్రస్థావించారు.
కొంతమంది తప్పుడు సర్వేలు చేయిస్తున్నారనీ, వీటిపై అప్రమత్తంగా ఉండాల్సి అవసరం ఉందని నాయకులకు చంద్రబాబు సూచించారు. ఎప్పటివో పాత కేసులు తవ్వి తీసి, మనల్ని ప్రభావితం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలనీ, ప్రజలను ఆకట్టుకునే విధంగా పనితీరు ఉండాలని సభ్యులకు ముఖ్యమంత్రి సూచించారు. పాత కేసులు, తప్పుడు సర్వేలతో ప్రజల దృష్టిని మరల్చడం, శాంతి భద్రతలు దెబ్బతీసి అశాంతిని సృష్టించాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు! రైతులు టీడీపీకి అండగా ఉండటంతో ప్రతిపక్షం అక్కసు వెళ్లగక్కుతున్నాయనీ, సొంత మీడియాని అడ్డం పెట్టుకుని వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారనీ, కాబట్టి అసెంబ్లీ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాజా సర్వేలను ప్రతిపక్షాల దుష్ప్రచారంలో భాగంగానే ముఖ్యమంత్రి విశ్లేషించే ప్రయత్నం చేశారు.
కొన్ని సంస్థల సర్వేలను ప్రజాభిప్రాయాలని పూర్తిగా ప్రజలు విశ్వసించే పరిస్థితీ లేదు! ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడం కోసం కొన్ని పార్టీలు చేయించే ఇలాంటి కార్యక్రమాలపై ప్రజలకూ స్పష్టత ఉంది. సర్వేలు చెబుతున్నాయి కదా అని సొంత నిర్ణయాలను మార్చుకునే పరిస్థితి దాదాపు ఉండదు. గత ఎన్నికల్లో కూడా జగన్ ముఖ్యమంత్రి అయిపోవడం దాదాపు ఖాయమని చాలా సర్వేలు చెప్పాయి. కానీ, చివరికి ఫలితం ఏమైంది..? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే కొంత వాస్తవానికి దగ్గరగా ఉంటాయని చెప్పొచ్చు. అంతేగానీ, ఎన్నికలకు ముందు వచ్చే వాటిలో ప్రామాణిక అనేది ప్రజలకూ తెలిసిన విషయమే.