విశాఖలో జరిగిన ధర్మపోరాట దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ప్రత్యేక హోదాతోపాటు, ప్రస్తుతం వివాదాస్పదం అవుతున్న టీటీడీ అంశంపై కూడా ఆయన స్పందించారు. కేంద్రం సహకరించి ఉంటే ఆంధ్రా మరింత అభివృద్ధి చెంది ఉండేదని చంద్రబాబు అన్నారు. కేంద్రం సహాయ నిరాకరణ, అడుగడుగునా అడ్డంకులు, ఏ పనీ కానీయకుండా అడ్డుపడటం.. ఇవన్నీ అధిగమించి ముందుకు సాగుతుంటే, ఓ పక్క నమ్మకద్రోహం, ఇంకోపక్క కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరోజు తిరుమలకు వెళ్తుంటే 24 క్లైమోర్ మైన్స్ పేలుళ్ల నుంచి తనను కాపాడింది ఆ వెంకటేశ్వర స్వామి మాత్రమే అన్నారు. తనతో ఏదో పని చేయించాలన్న అవసరం ఉందని కాపాడాడనీ, ఆ పనే నవ్యాంధ్రను అభివృద్ధి చేయడమే అని చెప్పారు.
వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీసే విధంగా.. ఎప్పుడో గులాబీ రంగు వజ్రం పోయిందనీ అంటున్నారనీ, కానీ దీనిపై అన్ని రికార్డులు ఎస్టాబ్లిష్ చేశారన్నారు. దీనిపై జగన్నాథరావు కమిషన్ వేశారనీ, ఆ తరువాత మరో కమిటీ వేశారన్నారు. ఇది వజ్రం కాదు కెంపు అని ఆరోజుల్లోనే తేల్చారన్నారు. ఈరోజు మాట్లాడుతున్న కృష్ణారావు కూడా నాడు ఈవోగా ఉన్నారనీ, ఆయనే ప్రభుత్వానికి దీనిపై రిపోర్టు కూడా ఇచ్చారన్నారు. ఇంకోపక్క, పోటులో ఏదో జరిగిపోయిందనీ, గుప్త నిధులున్నాయనీ ఎవరో తవ్వుతున్నారని అంటున్నారన్నారు. వాస్తవానికి అక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామికి వంట చేస్తారన్నారు. అక్కడేం జరగకపోయినా ప్రజల్లో అనుమానం కలిగించేలా ప్రయత్నం చేశారన్నారు. ఇవన్నీ భాజపా కుట్రలో భాగమన్నారు. ప్రధాన అర్చకులని ఢిల్లీకి పిలిపించుకుని, తప్పుడు సమాచారం చెప్పిస్తున్నారన్నారు. ఈయన కూడా తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి పక్కనే రాజశేఖర్ రెడ్డి ఫొటో పెట్టుకున్నారంటే.. ఈయన ఎలాంటి స్వామో మీరు ఆలోచించాలన్నారు. ఇంకోపక్క, తాను బ్రాహ్మణుల అభవృద్ధికి ఎంతో కృషి చేస్తున్నాననీ, ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టి ఆదుకునే ప్రయత్నం చేశానన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో వైకాపా పోరాటంపై సీఎం విమర్శలు చేశారు. వారికి నరేంద్రమోడీపై విశ్వాసం, బయటకు వచ్చి అవిశ్వాసం అన్నారు. టీడీపీ ఎంపీలు పదవులకు వెనకాడకుండా హోదా కోసం రాజీనామాలు చేశారన్నారు. ప్రధాని ఇంటి వద్ద నిరసన తెలియజేస్తే కొట్టినా టీడీపీ ఎంపీలు భయపడలేదన్నారు. పార్లమెంటులో మొదటిసారిగా రాష్ట్ర ప్రయోజనాల కోసమై గళమెత్తింది టీడీపీ అవునా కాదా అన్నారు. టీడీపీ అవిశ్వాసం తీర్మానం అనగానే దేశవ్యాప్తంగా అందరూ మద్దతు పలికారనీ, అదీ టీడీపీకి ఉండే విశ్వసనీయత అని చెప్పారు. టీటీడీ అంశంపై సీఎం స్పందన ఘాటుగానే ఉంది. ఇక ప్రత్యేక హోదాపై కేంద్రంపై పోరాటంపై వైకాపా తీరును మరోసారి వివరించే ప్రయత్నం చేశారు.