తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస అధినేత కేసీఆర్ చేస్తున్న విమర్శలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూనే ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తెలంగాణకు అవసరమా అవసరమా అంటూ ప్రజలను గుచ్చిగుచ్చి అడిగి మరీ సమాధానాలు చెప్పిస్తున్నారు. మహా కూటమి అధికారంలోకి వస్తే.. చంద్రబాబు నాయుడు చేతిలోకి తెలంగాణ వెళ్లిపోతుందనే అభిప్రాయాన్ని కేసీఆర్ ప్రచారం చేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ విమర్శలకు ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానాలు చెప్పారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒక సభలో మాట్లాడుతూ… కేసీఆర్ తనను తిడుతుంటే బాధ కలుగుతోందన్నారు.
తెలుగు జాతి కోసం, దేశ ప్రయోజనాల కోసం తాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను అన్నారు చంద్రబాబు. తెలంగాణా కూడా అభివృద్ధి కావాలనీ, వారూ మనకు సహకరించాలని తాను భావిస్తా అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం, హైదరాబాద్ లో ఉండే ప్రజల ప్రయోజనాల కోసం… ఏ అభివృద్ధి కోసమైతే తాను కష్టపడ్డానో అది జరగాలంటే తెరాస ఓడిపోవాలనీ, ప్రజా కూటమి గెలిచి తీరితేనే న్యాయం జరుగుతుందన్నారు. ఈరోజున కేసీఆర్ తనని తిడుతున్నారనీ, నిన్న మొన్న అంతకుమునుపు.. తిడుతున్నారనీ, ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నారు. తెలుగు జాతి మొత్తం కలిసి ఉండాలని తాను అంటున్నాననీ, రాష్ట్రాలుగా విడిపోయినా కలిసుందామని అంటున్నానని చంద్రబాబు చెప్పారు. కానీ, ఇలాంటివి చెప్పడానికి మీరెవరు అనేట్టు ఇష్టప్రకారం కేసీఆర్ మాట్లాడుతున్నారు అన్నారు.
కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారో ప్రజలకే తెలుసన్నారు. ఆయన తెలుగుదేశంలోనే ఉన్నారు, రాజకీయ జీవితాన్ని ఈ పార్టీయే ప్రసాదించిందని గుర్తుచేశారు. తనతోనే తన అనుచరుడిగా ఉంటూ వచ్చిన కేసీఆర్, ఇవాళ్ల తనని తిడుతూ ఉంటే బాధ కలగదా అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తన మానసిక పుత్రిక అనీ, జరిగిన అభివృద్ధి ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటానని చెప్పారు. అయితే, తొమ్మిదేళ్లలో హైదరాబాద్ అభివృద్ధి చేశారు కదా, అమరావతి ఎందుకు చెయ్యలేకపోయారని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారన్నారు. ‘ఈరోజు చెప్తున్నా.. అమరావతిని ప్రపంచంలోనే ఐదు అద్భుత నగరాల్లో ఇది ఒకటిగా ఉంటుంది. దీన్లో అనుమానమే లేదు’ అని కేసీఆర్ ని ఉద్దేశించి సీఎం చెప్పారు.