రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్డీఏలో చేరడానికి సిద్ధమేనన్నట్లుగా చంద్రబాబు సంకేతాలు పంపారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ ఎన్డీఏలో చేరబోతోందని ఢిల్లీ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులతో ఆయన భిన్నంగా స్పందించారు. తాము ఎన్డీఏలో చేరుతున్నామో లేదో.. ప్రచారం చేసేవారే జవాబు చెప్పాలని స్పష్టం చేశారు.రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని గుర్తు చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే కేంద్ర రాజకీయాలను చూస్తామని స్పష్టం చేశారు. పాలనపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల పార్టీ రెండుసార్లు నష్టపోయిందన్నారు. రాష్ట్రానికి మంచిపేరు తేవాలనే తపనతో వ్యక్తిగతంగా నష్టపోయామన్నారు. అయితే చంద్రబాబు తాము మళ్లీ ఎన్డీఏలో చేరే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టలేదు. అంటే ఆప్షన్ ఉందన్నట్లుగానే చంద్రబాబు సమాధానం ఉందని భావిస్తు న్నారు. గతంలో ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో కూడా చంద్రబాబు చెప్పారు.
ఎన్డీఏలో చేరికను చంద్రబాబు పూర్తిగా ఖండించలేదు. అలాగని ఆయన పాజిటివ్‌గా కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే .. కేంద్ర రాజకీయాలను చూస్తామని ఆయన చెప్పడంతో.. రాష్ట్రానికి మేలు జరిగితే.. ఎన్డీఏలో చేరేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిచ్చినట్లుగా భావిస్తున్నారు. చేరే ఉద్దేశం లేకపోతే ఆ విషయాన్ని ఖరాఖండిగా చెప్పారు. కానీ దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లుగా మాత్రం ఆయన రెస్పాన్స్‌తో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది.