మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నుంచి వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో స్పందించారు. తానేమీ నేరాలు – ఘోరాలు చేయలేదని.. ప్రజల కోసమే పోరాడానన్నారు. మహారాష్ట్ర అక్రమగా బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తూంటే.. ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందని పోరాటం చేశానని గుర్తు చేశారు. ” బాబ్లీ కేసులో నాకు నోటీలిచ్చామని అంటున్నారు. నేను నేరం చేయలేదు.. ఘోరాలు చేయలేదు.. అన్యాయం అస్సలే చేయలేదు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని బాబ్లీని వ్యతిరేకించాను. నేనేం తప్పు చేయలేదు.. ఏం చేస్తారో చేయండి అని ఆ రోజే పోలీసులకు చెప్పాను” అని స్పష్టం చేశారు. ఇప్పుడు నోటీసులు.. అరెస్ట్ వారెంట్లు అంటున్నారని.. ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.
మరో వైపు నాన్ బెయిలబుల్ వారెంట్లపై ఏపీలో రాజకీయ రచ్చ ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ నేతలంతా వరుసగా మీడియా ముందుకు వచ్చింది… ఇదందా బీజేపీ కుట్రేనని ఆరోపిస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడే ఎందుకు వారెంట్లు పంపారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ నేతలు కూడా అవకాశం వచ్చింది కాబట్టి.. అప్పట్లో తాము జరిపిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి… తెలంగాణ కోసం తామెంత పోరాడామో గర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలకు బీజేపీ నేతలు కూడా కౌంటర్లు ఇచ్చారు. పురందేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, విష్ణుకుమార్ రాజు సహా అందరూ.. మహారాష్ట్ర కోర్టు ఇచ్చిన అరెస్ట్ వారెంట్ కు.. బీజేపీకి సంబంధం ఏమిటని ప్రశ్నలు గుప్పించారు. ఈ కేసు విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు చంద్రబాబుకు వారెంట్లు జారీ చేయడాన్ని ఖండించారు. చంద్రబాబుపై కేసును తీసేయాలని డిమాండ్ చేశారు. పనిలో పనిగా.. తాము చేసిన ప్రజాపోరాటాల్లో పెట్టిన కేసులను కూడా తీసేయాలని డిమాండ్ చేశారు.
అయితే ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన వారెంట్లలో కేవలం 14 మంది పేర్లు మాత్రమే ఉన్నాయి. అప్పట్లో 70 మందికిపైగా టీడీపీ నేతలు బాబ్లీ పర్యటనకు వెళ్లారు. వారందరిపైనా కేసులు పెట్టారు. వెళ్లిన వాళ్లలో చాలా మంది ఇప్పటికీ టీడీపీలో ఉన్నారు కాబట్టి… వారంతా.. తమకు ఎందుకు నోటీసులు రాలేదనే ధర్మ సందేహాన్ని వెలిబుచ్చుతున్నారు. ఇందులో కుట్ర ఉంది కాబట్టే.. కొంత మందికే పంపారని అంటున్నారు. మొత్తానికి నాన్ బెయిలబుల్ వారెంట్లు మాత్రం… ఏపీతో పాటు తెలంగాణలోనూ కొత్త రాజకీయానికి దారి తీస్తున్నాయి.