తెలంగాణ తర్వాత ఐటీ దాడుల వ్యవహారం ఇప్పుడు ఏపీకి షిప్ట్ అయింది. ఐటీ బృందాలు ఏపీపై విరుచుకుపడ్డాయి. ఏకంగా 19 బృందాలు ఆంధ్రప్రదేశ్ లో తనిఖీలు ప్రారంభించాయి. గురువారం రాత్రి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నుంచి వచ్చిన ఐటీ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలే టార్గెట్ గా దాడులు ప్రారంభించారు. కావలిలో బీద మస్తాన్ రావు కంపెనీల్లో సోదాలు చేశారు. కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కంపెనీల్లోనూ దాడులు చేశారు. అసలు నారాయణ విద్యాసంస్థలపై దాడుల కోసం ప్రయత్నించారన్నప్రచారం జరిగింది. తర్వాత సదరన్ డెవలపర్స్ అనే కంపెనీతో పాటు మరికొన్ని సంస్థలను టార్గెట్ చేశారు. కొద్ది రోజుల నుంచి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామని.. మరొకటని.. బీజేపీ నేతలు బెదిరిస్తూనే ఉన్నారు. దాంతో… ఇలాంటివి ఏవో జరుగుతాయని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.
ఈ ఐటీ దాడుల వ్యవహారంలో మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో చంద్రబాబు చర్చించారు. ఒకే సారి 19 ఐటీ బృందాలతో దాడులు చేయడం ఇదే మొదటిసారి అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఏపీపై పగబట్టారని మంత్రులు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని పోరాడుతుంటే..కక్ష కట్టారని.. ఇప్పటికే ఇద్దరు టీడీపీ నేతల ఇళ్లపై దాడులు జరిగాయని మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి నారాయణ కార్యాలయం, కాలేజీలపై ఐటీ దాడులకు ప్రయత్నించి..మీడియాను చూసి వెనక్కి తగ్గారని మంత్రులు తెలిపారు. ప్లాన్- ఏ లో మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకున్నారని దాడుల వ్యూహం బయటికి రావడంతో..ప్లాన్-బి కింద పారిశ్రామిక వేత్తలపై దాడికి దిగుతున్నారని మంత్రులు విశ్లేషించారు. పెట్టుబడిదారులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు. మరిన్ని రోజులు ఐటీ దాడులు కొనసాగే అవకాశముందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు.
మంత్రుల అభిప్రాయాలతో చంద్రబాబు ఏకీభవించారు. తెలుగువారిని అవమానించి వేధించేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇంతకు పదిరెట్లు దాడులు చేసినా టీడీపీ తలవంచదని స్పష్టం చేశారు. ఈ దాడుల వ్యవహారంపై ఎలా స్పందించాలన్నది శనివారం పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయించనున్నారు. జాతీయ స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. అలాగే న్యాయపరమైన అంశాలను పరిశీలిద్దామని మంత్రులకు చంద్రబాబు సూచించారు. గుజరాత్, కర్నాటక, యూపీలో జరిగిన ఎన్నికలలో ప్రత్యర్ధి పక్షం పై ఐటీ, సీబీఐ దాడులు నిర్వహించి భయకంపితులను చేయడం, యన్డీఎ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని తెలుగుదేశం నేతలు అంటున్నారు.