తాను మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమౌతుందో తెలుసుకో అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి తెరాస అధినేత కేసీఆర్ నల్గొండ సభలో తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు నిజామాబాద్ సభలో కూడా ఇదే తరహాలో ఏపీ సీఎం చంద్రబాబును లక్ష్యంగా చేసుకునే మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తాను నాలుగు దశాబ్దాలుగా హుందాగా రాజకీయాలు చేస్తున్నాననీ, పరుష పదజాలం వాడటం తన వ్యక్తిత్వం కాదన్నారు చంద్రబాబు. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో కార్నర్ చెయ్యాలన్నదే కేసీఆర్ ఉద్దేశం అన్నారు. వైకాపా, పవన్ కల్యాణ్, కేసీఆర్ లు భాజపాతో కలిసి ఉన్నారనీ, బయటకి ఎందుకీ నాటకాలన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని తెరాస కూడా చెప్పిందనీ, అయితే తాను భాజపాతో తెగతెంపులు చేసుకోగానే ఒకేసారిగా మాట మార్చారనీ, ఆ తరువాత ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. తన గురించి అంతగా తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనీ, తాను చేసిన తప్పేంటనీ, హైదరాబాద్ అభివృద్ధి చెయ్యడం తప్పుగా కనిపిస్తోందా, బాబ్లీపై పోరాటం తన తప్పా, రాత్రింబవళ్లూ కష్టపడి కృషి చేయడం తన తప్పా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా దర్శకత్వంలో ఎప్పటికప్పుడు తనపై మాటల దాడి చేయడమేంటని ప్రశ్నించారు? తాను చేసిన తప్పేంటో తెలుగువారంతా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరముందున్నారు. వారు సమాయానికో రకంగా మీరు మాట మారుస్తూ వస్తున్నారనీ, తాను మొదట్నుంచీ ఒకే మాట మాట్లాడుతున్నా అన్నారు.
ప్రజలకు విజ్ఞత ఉందనీ, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు దీనిపై ఆలోచించి నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఏ సందర్భంలోనూ పరుష పదజాలం వాడననీ, అది తన సభ్యత కాదనీ, ఉద్యమ సమయంలో కూడా సంయమనంతో ఉండటం ప్రజలంతా చూశారన్నారు. మొత్తానికి, కేసీఆర్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు సీఎం చంద్రబాబు. నిజానికి, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తమ ప్రధాన ప్రత్యర్థి అనే స్థాయిలో కేసీఆర్ లో విమర్శలు ఉంటూ ఉండటం గమనార్హం. ఇక, నల్గొండ సభలో విషయానికొస్తే… కేసీఆర్ మరింత డోస్ పెంచి విమర్శలు చేశారు. దీని వెనకున్న వ్యూహం కూడా అర్థమౌతూనే ఉంది. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే… తెరాసకు ఎదురీత తప్పదనే వాతావరణం ఉంది కాబట్టే… ఈ తరహాలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కేసీఆర్ చేశారనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.