నంద్యాల ఎన్నికల ఫలితంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించిన తీరుతో పోలిస్తే కాకినాడ కార్పొరేషన్ విజయంపై కాస్త సంయమనం పాటించినట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ సారి వైసీపీ కంటే జగన్ను పరోక్షంగా బలపరుస్తున్నారని చెప్పే మేధావులు, సంఘాలపై ఎక్కువ వ్యాఖ్యలు చేశారు. వారంతా స్పాన్సర్డ్ ఏజంట్లేనన్నట్టు చెప్పుకొచ్చారు. ఈ విషయంలో కొందరి పేర్లు టిడిపి నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. ఎన్నికల వరకూ ఆందోళనలు చేసి అప్పుడు ఆపేశారని కాపునేత ముద్రగడను పేరెత్తకుండా దెప్పిపొడిచారు. నంద్యాల ఎన్నికల ఫలితం మరుసటిరోజునే కాకినాడ పోలింగ్ జరగడానికి తనకూ ఏ సంబంధం లేదని, అంతా కోర్టు తీర్పు ప్రకారమే జరిగిందని విడగొట్టుకున్నారు. అయితే ఈ విజయం తనపట్ల తన ప్రభుత్వ విధానాల పట్ల పూర్తి ఆమోదమని చెప్పుకోవడం సహజంగా జరిగేదే. కాని రాజకీయంగా కీలకమైంది ఏమంటే ఫిరాయించిన ఎంఎల్ఎలతో రాజీనామా చేయించి ఎన్నికలు ఎదుర్కోవాలంటూ వైసీపీ చేస్తున్న వాదనను తోసిపుచ్చడమే. ఎన్నికలకు వెళ్లడం పెద్ద సమస్య కాదంటూ సుత్తిమెత్తగా తోసి పారేశారు. పైగా పదే పదే ఎన్నికలు మంచిది కాదని సూక్తులు చెప్పారు. కోర్టులలో కూడా వుంది గనక అదీ చూడాలని అవకాశం అట్టిపెట్టుకున్నారు. జగన్ తనను కాల్చిపారేయాలంటే తను కూడా ఆయనను డేరా బాబు అనడం విమర్శకు గురైంది గనక ఆ తరహా చర్చకు అవకాశం లేకుండా చేసినట్టు కనిపిస్తుంది. పైగా వైసీపీపై ఎదురుదాడి కూడా పెద్దగా చేయకుండా తమ గురించి ప్రశంసలతో ముగించారు. అయితే మీడియాలోనూ ఇప్పటికీ నెగిటివ్గా రాస్తే మంచిదనుకునేవారున్నారని చెప్పడం ద్వారా తనను బలపర్చడమే పాజిటివ్ అని పాత సందేశం వినిపించారు.