ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించి చాలారోజులే అయింది. అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రతీ ఇంటికీ వెళ్లి, చంద్రబాబు సర్కారు చేపడుతున్న అభివృద్ధి పథకాల గురించి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించీ పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. దీన్లో భాగంగా పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలూ ప్రజల్లోనే ఉండాలంటూ సీఎం చంద్రబాబు గతంలోనే దిశానిర్దేశం చేశారు. ఇంతకీ.. ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో ఇంటింటికీ కార్యక్రమం జరుగుతోందా..? టీడీపీ నేతలు ప్రభావవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారా..? ఇలాంటి అంశాలపై అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్రంలో 40 నియోజక వర్గాల్లో ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని సమాచారం. వీటిలో ఓ 14 నియోజక వర్గాల్లో పరిస్థితి మరింత అద్వాన్నంగా ఉందనే అంశం కూడా సమావేశంలో చర్చకు వచ్చిందని సమాచారం.
ఈ సందర్భంలో ఆయా నియోజక వర్గాలకు చెందిన నాయకుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు ఒకింత అసంతృప్తి వ్యక్తి చేసినట్టు తెలుస్తోంది. ఎవ్వరిపైనా చర్యలు ఏవీ తీసుకోలేదుగానీ, నాయకుల మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర మొదలు పెడుతున్న సమయం కంటే ముందుగానే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నామనీ, ఇలాంటి సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదనీ, ఇప్పుడే ఇలా పనిచేస్తే… ప్రతిపక్ష నాయకుడి పాదయాత్ర ముగిసిన తరువాత ఆ పార్టీకి ధీటుగా ఎలా పనిచేస్తారంటూ చంద్రబాబు కొంతమంది నేతల్ని ప్రశ్నించినట్టు చెబుతున్నారు. ఇంటింటి కార్యక్రమం మందకొడిగా సాగుతున్న నియోజక వర్గాల బాధ్యతల్ని మంత్రి యనమల రామకృష్ణుడుకి అప్పగించారు. ముఖ్యంగా ఆ 14 నియోజక వర్గాలకు చెందిన నాయకులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడతారనీ, పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఆయన ప్రోత్సహిస్తారని చెబుతున్నారు. ఈ ఇంటింటి కార్యక్రమం గడువును మరో నెలరోజులపాటు పొడిగించారు కూడా!
మొత్తానికి, ఈ కార్యక్రమం విషయమై టీడీపీ అధినాయకత్వం కాస్త ఆందోళనగానే ఉన్నట్టు అనిపిస్తోంది. కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ నేతలు అతి విశ్వాసంతో వ్యవహరిస్తున్నారనే భావన చంద్రబాబుకు కలిగిందని చెప్పొచ్చు. జగన్ పాదయాత్రకు ప్రజాదరణ ఉండదని మీడియా ముందు చెబుతున్నా… క్షేత్రస్థాయిలో దానికి ఉండాల్సిన గుర్తింపు ఉంటుందనే విషయం చంద్రబాబు నాయుడుకి తెలియంది కాదు. అందుకే, జగన్ పాదయాత్ర మొదలుపెట్టేలోగానే.. టీడీపీ సర్కారు తమకు చాలా చేస్తోందనే ఒకరకమైన సంతృప్త భావనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నదే చంద్రబాబు వ్యూహం. ఆ తరువాత, జనంలోకి జగన్ వెళ్లి ప్రభుత్వ పనితీరుపై ఎన్ని విమర్శలు చేసినా.. వాటి ప్రభావం కొంత తక్కువగానే ఉండే ఛాన్స్ ఉంటుంది కదా! అందుకే, ఇంటింటి టీడీపీ కార్యక్రమం విషయంలో ఏ ఒక్క నియోజక వర్గాన్ని కూడా ఆయన వదలిపెట్టడం లేదు. అలాగని, నిర్లక్ష్యంగా ఉంటున్న టీడీపీ నేతలపై చర్యలు అంటూ ఆగ్రహించనూ లేదు. ఈ కార్యక్రమం విషయంలో చంద్రబాబు గురౌతున్న ఆందోళనను ముందుజాగ్రత్త చర్య అనొచ్చు! లేదా, ప్రతిపక్ష నేత పాదయాత్రను తట్టుకునే వ్యూహాల్లో ఒకటీ అనొచ్చేమో!