తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి… మహాకూటమి ఏర్పడినా.. ఇక్కడ రాబోయే ఫలితం దేశం మొత్తం ప్రభావం చూపిస్తుంది. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక పక్షాలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. సుదీర్ఘ వైరం, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు కలవరని, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ జరగదన్న అంచనాతో టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ కూడా ఇదే మాట తమ మాట అభ్యర్థులకు.. చెప్పి.. ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే.. కేసీఆర్ అంచనా … కరెక్ట్ కాదని నిరూపించేందుకు… తమ మధ్య అరమరికలు లేవని చాటాలని నిర్ణయించుకున్నారు. శ్రేణుల ఏకీకరణకు రోడ్ షోలు నిర్వహించాలని నిర్ణయించారు.
రాహుల్, చంద్రబాబు విడివిడిగా ప్రచారం చేయడం కన్నా.. ఇద్దరూ కలిసి రోడ్ షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల అధిష్ఠానాలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో వీరి ప్రచారం ఉండనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపుగా 24 సెగ్మెంట్లలోనూ వీరి ప్రచారం ఉండే అవకాశం ఉంది. ఈనెల 22-30 మధ్య ఉమ్మడి రోడ్ షోలు ఉంటాయి. వరుసగా రెండు, మూడు రోజులపాటు వీటిని కొనసాగించేలా కసరత్తు జరుగుతోంది. గ్రేటర్ లో ఉన్న విభిన్నమైన పరిస్థితుల కారణంగా.. కూటమి గెలుస్తుందని నమ్మకం కలిగిస్తే.. ఓట్ల వెల్లువ రావడం ఖాయమే. కూటమి అధికారంలోకి వస్తుందన్న సానుకూల భావన కలిగించి, ఓట్లు చీలిపోకుండా రాహుల్, చంద్రబాబు ప్రచారం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.
రాహుల్, చంద్రబాబు సంయుక్త రోడ్ షోలు… సమీకరణాల్ని మార్చే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్.. ఈ విషయంలో విరుగుడు విమర్శలు ప్రారంభించింది. సీమాంధ్ర ఓటర్లలో… తెలుగుదేశం పార్టీపై విశ్వాసం లేదని.. చంద్రబాబును నమ్మడం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్.. దాదాపుగా ప్రతీ మీడియా సమావేశంలోనూ అదే చెబుతున్నారు. తెలంగాణలో కూటమి సక్సెస్ అయితే.. అది.. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకున్న కూటమికి.. ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.