తెలంగాణలో తనకేంటి పని అంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారనీ, నాలుగు భవనాలు నిర్మిస్తే అభివృద్ధి అయిపోతుందా అని వ్యాఖ్యానిస్తున్నారు అన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ‘నేను లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావ్? టీడీపీ లేకపోతే మీరెక్కడ’ అని సూటిగా అడిగారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో జరిగిన రోడ్ షో లో ఏపీ సీఎం పాల్గొన్నారు. తనకంటూ ఒక నమూనా ఉందనీ, ఎవరు ఎన్ని చెప్పినా హైటెక్ సిటీ నిర్మించింది తానేనని ప్రజలంతా ఒప్పుకుంటారన్నారు. సైబరాబాద్ కి తానే స్వయంగా నామకరణం చేశా అన్నారు. హైదరాబాద్ కి తానేం చేశానో చెప్పడానికి చాలా ఉన్నాయనీ, కానీ నాలుగున్నర సంవత్సరాల్లో హైదరాబాద్ కి కేసీఆర్ ఏం చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఫామ్ హౌస్ తప్ప కొత్తగా కట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ నియంతగా వ్యవహరిస్తుంటే, ఇక్కడ కేసీఆర్ కూడా జూనియర్ మోడీలా ప్రవర్తిస్తున్నారు అన్నారు.
తనను తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారనీ, దాని కోసమే మీటింగులు పెడుతున్నారనీ, ‘ఎక్కడ మీటింగ్ పెట్టినా అతనికి నేనే కనిపిస్తున్నా. ఎందుకో అర్థం కావడం లేదు’ అన్నారు చంద్రబాబు. ‘నేనేమీ ఇక్కడ ముఖ్యమంత్రిని కాను. ఇక్కడ సీఎం కాగలనా…? ఈరోజున ప్రజా కూటమి గెలుస్తోంది. దానికి టీడీపీ తోడైందనే అసూయతో బాధతో మన మీద పడ్డారు’ అని విమర్శించారు. గతంలో కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేసింది లేదనీ, ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, భాజపా వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా బయటకి వెళ్లకూడదన్న సంకల్పంతో తాము కలిశామన్నారు. ఆ మధ్య ఫెడరల్ ఫ్రెంట్ అంటూ కేసీఆర్ హడావుడి చేశారనీ, ఎవరైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలనుకుంటే చెడగొట్టి, భాజపాకి సేవ చేయడానికి వెళ్లారన్నారు. మోడీని సమర్థంగా ఎదుర్కొనే కూటమి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐలతో ఉన్న కూటమి తప్ప.. మరొకటి లేదని కేసీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు. కేసీఆర్ కి అసలు ఓటు బ్యాంకే ఇప్పుడు లేదనీ, ఆయనతో కలిసి ఉద్యమించిన కోదండరామ్, గద్దర్, విద్యార్థి సంఘాలు.. ఇలా అందరూ బయటకి వచ్చారన్నారు. ఎన్టీ రామారావు కొన్ని లక్షల మందికి రాజకీయ జన్మనిస్తే… అదే పార్టీలోని సమర్థులు కొందర్ని తాను ప్రోత్సహించా అన్నారు. అన్ని వనరులు ఉండే రాష్ట్రం ఆయనకి ప్రజలు అప్పగిస్తే, దాన్ని అప్పుల మయం చేశారన్నారు.
హైదరాబాద్ కి కేసీఆర్ ఏం చేశారనే చంద్రబాబు సూటి ప్రశ్నకు తెరాస నుంచి సమాధానం వస్తుందేమో చూడాలి! నిజానికి, చంద్రబాబు చేస్తున్న విమర్శల్ని కేసీఆర్ పక్కతోవ పట్టించే ప్రయత్నమే చేస్తున్నారు. హైదరాబాద్ ని ఆయనే కట్టించాడని అంటున్నాడని ఎద్దేవా చేస్తున్నారే తప్ప… తెరాస అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ కి ప్రత్యేకంగా వారు చేసిందేంటనే చర్చను ప్రముఖం కాకుండా కేసీఆర్ జాగ్రత్తపడుతున్నారు. చంద్రబాబును విమర్శించే క్రమంలో అభివృద్ధిలో ఏపీతో పోలిక తెస్తూ, కరెంట్ ఇచ్చామని చెబుతూ ఇలా కేసీఆర్ విమర్శిస్తున్న పరిస్థితి.