ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 30 నుంచి వచ్చే నెల 7 వరకూ వారం పాటు జరుగుతున్నాయని ముందుగా ప్రకటించారు. కానీ, ఇప్పుడా తేదీల్లో చిన్న మార్పు చేస్తూ… వచ్చే 4 నుంచి 11 వరకూ సమావేశాలు జరుగుతాయి. తేదీల మార్పు వెనక రాజకీయ కారణాలేవీ లేవుగానీ… కొన్ని సాంకేతిక అంశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పెన్షన్లను రూ. 2 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పెన్షన్లు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ రెట్టింపు పెన్షన్లను వచ్చే నెల నుంచే పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు, సమర్థంగా అమలుచేసి తీరాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
వచ్చే నెల 1 నుంచి 3 వరకూ మూడు రోజులపాటు ఈ పెన్షన్లకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ ఎమ్మెల్యేలందరికీ ముఖ్యమంత్రి ఆదేశించారు. కాబట్టి, ఎమ్మెల్యేలంతా స్థానికంగా వారివారి సొంత నియోజక వర్గాల్లో గ్రామాల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి, 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుంటే… స్థానికంగా గ్రామస్థాయికి వెళ్లే ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఉండరు. అందుకే, సమావేశాలను 4కి వాయిదా వేశారని తెలుస్తోంది. దీంతోపాటు, రాబోయే కొద్దిరోజుల్లో మరిన్ని పథకాలను ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సమాచారం. సోమవారం జరగనున్న మంత్రి మండలి సమావేశాల్లో రైతులకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాబోయే అసెంబ్లీ సమావేశాలు చివరివి కాబోతున్నాయి కాబట్టి, వీటన్నింటినీ చెప్పుకునేందుకు వీలుగానే సభా నిర్వహణ తేదీలను మార్చుకున్నట్టు చెప్పొచ్చు. ఎన్నికలకు వెళ్లే సమయం వచ్చేసింది కాబట్టి… ఇంతవరకూ టీడీపీ ప్రభుత్వం చేసిన పాలనపై, అమలు చేసిన సంక్షేమ పథకాలపై, తీసుకున్న కీలక నిర్ణయాలపై సవివరంగా ప్రజలకు వివరించే ప్రయత్నం ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకోపక్క, చివరి సమావేశాలైనా కూడా ఏపీ ప్రతిపక్ష పార్టీ సభ్యులు సభకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.