వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం నల్లేరు మీద నడక అనే ధీమాతో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు! తాము చేస్తున్న అభివృద్ధి పథకాలే తమకు విజయాన్ని ఇస్తాయని చెప్పారు. రాజధాని అమరావతిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు వచ్చాయనీ, ఒక్కో దాన్నీ అధిగమించుకుంటూ వస్తున్నామనీ, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఆంధ్రాను తీర్చిదిద్దుతున్నామన్నారు. అన్ని రకాలుగా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ ఉన్నామన్నారు. ఈ దశలో అధికార పార్టీ నాయకుల్ని ప్రజల్లోకి పంపించామనీ, ప్రజలతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతోనే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టామన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏం చేయాలనేది ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు.
2019 మాత్రమే కాదు, 2024 కూడా, 2029 కూడా.. తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు చెప్పారు. మనం మంచి పనులు చేస్తే ప్రజలు మనతోనే ఎప్పుడూ ఉంటారన్నది తన విశ్వాసం అని ముఖ్యమంత్రి అన్నారు. మనం చేసే పనులను బట్టే ఫలితాలుంటాయన్నారు. ఈ సందర్భంగా మరోసారి విపక్షం వైకాపాపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయమై ఎంతో శ్రద్ధ తీసుకుని, కరువు అనేదే లేకుండా చేద్దామని తాము ముందుకు సాగుతుంటే, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఏదో ఒకటి చేసి అడ్డుకోవడమే కనిపిస్తోందిగానీ, ప్రజలకు పనికొచ్చే రాజకీయాలు వీళ్లు చేయడం లేదని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.
2019లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేయడం వరకూ ఓకే! ఎందుకంటే, సమీపంలో ఉన్న ఎన్నికలు అవే కాబట్టి. అంతేగానీ, 2024, 29 లో కూడా టీడీపీదే ఏకపక్ష గెలుపు అని చెప్పడం కాస్త అతి విశ్వాసం అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఫలితాలు టీడీపీకి కొత్త జోష్ ఇచ్చిన మాట వాస్తవమే. ఇవే ఫలితాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉంటాయని చెప్పడం అనేది.. పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపడానికి పనికొస్తుంది. అయితే, ఇలా మరో పదేళ్లలోపు వచ్చే ఎన్నికల్లో కూడా తమదే గెలుపు అని పార్టీ అధినేత ధీమా వ్యక్తం చేస్తుంటే పార్టీ కేడర్స్ కి వేరే సంకేతాలు వెళ్తాయి కదా! అంతేకాదు, పార్టీ తరఫున ఎవరికి టిక్కెట్ ఇచ్చినా ఈజీగా గెలుస్తారని కూడా చంద్రబాబు చెప్పడం విశేషం. మరో దశాబ్దంపాటు అధికారానికి ఢోకా లేదని సాక్షత్తూ చంద్రబాబు నాయుడే చెబుతుంటే, క్షేత్రస్థాయి మరీ చెమటోడ్చి కష్టపడాల్సిన అవసరం ఏమేందనే భావన వందలో ఒక కార్యకర్తకు కలిగినా ఇబ్బందే అవుతుంది కదా! ఇలాంటి వ్యాఖ్యల ద్వారా కిందిస్థాయి నాయకత్వంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వైపు వెళ్లే అవకాశాలుంటాయి కదా!