తెలంగాణ అంతా ఎన్నికలు జరగబోతున్నా….ప్రధాన పార్టీల దృష్టంతా గ్రేటర్ హైదరాబాద్ పైనే ఉంది. గ్రేటర్లో 24 నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లు సాధిస్తే గెలుపు సునాయాసం అవుతుందని పార్టీల అంచనా. ఆ కోణంలోనే మహాకూటమి ప్రధానంగా గ్రేటర్ పైనే ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ అత్యధిక సీట్లు సాధించాయి. పొత్తులో బాగంగా టీడీపీకి 12 పైగా సీట్లు దక్కే అవకాశాలున్నాయి. దీంట్లో ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉండనున్నాయి. 8సీట్ల వరకు హైదరాబాద్ లోనే పోటీచేయాలని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. శేరిలింగంపల్లి, కూకట్ పల్లి , మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేయడానికి సిద్ధమయింది.
చంద్రబాబును తెలంగాణలో ప్రచారం చేయాలని నేతలు కోరారు. దానికి ఆయన అంగీకరించారు కూడా. చంద్రబాబు ప్రచారానికి సంబంధించి షెడ్యూలు త్వరలోనే వెల్లడిస్తారు. చంద్రబాబు గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోనూ సభలు పెడతారు. ఎక్కువ గ్రేటర్ లో క్యాంపెయిన్ చేయించడం ద్వారా సెటిలర్ల ఓట్లు గంపగుత్తగా మహాకూటమికి పడతాయనే భావనలో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ – టీడీపీ కలువడంవల్లే మంచి ఫలితాలు గ్రేటర్ లో పొందవచ్చని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి.
చంద్రబాబు ప్రచారం చేసినా తమకేం ఇబ్బంది లేదనే భావనలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. జీహెచ్ఎంసి ఎన్నికల్లో చంద్రబాబు ప్రచారం చేసినా టిఆర్ఎస్ విజయాన్ని ఆపలేకపోయారంటోంది. గత కార్పోరేషన్ ఎన్నికల బాధ్యతలను మంత్రి కెటీఆర్ కు అప్పగించారు. ఈ ఎన్నికల బాధ్యతలు కూడా ఆయనకే ఇచ్చారు. కెటీఆర్ ఇప్పటికే సెటిలర్లతో మంతనాలు కూడ సాగిస్తున్నారు. ప్రగతిభవన్ కు పిలిపించుకొని మాట్లాడుతున్నారు. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల చీలిక కోసం.. వైసీపీ, జనసేనలు చివరి క్షణంలో పోటీకి సిద్ధమవుతాయని భావిస్తున్నారు. చంద్రబాబు ప్రచారం చేస్తే ఇవన్నీ కొట్టుకుపోతాయని మహాకూటమి నేతలు ధీమాతో ఉన్నారు.