ఆంధ్రప్రదేశ్‌కు కావాలని అన్యాయం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై ఇక ఒక్కో అస్త్రాన్ని ప్రయోగించడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. బడ్జెట్ తర్వాత తొలిసారి ఓ బహిరంగ సభలో మోదీ ప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేసిన బాబు.. ఇప్పుడు దానికి సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి హ్యాండిచ్చి వైసీపీతో కలిసి వెళ్దామనుకుంటున్న బీజేపీని పక్కా ప్లాన్‌తో దెబ్బకొట్టాలన్నది బాబు యోచన. ఇన్నాళ్లూ సహనంతో వ్యవహరించిన ఆయన.. ఇక అటు బీజేపీ, ఇటు వైసీకి ఒకేసారి షాకివ్వాలని భావిస్తున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి మార్చి 5 వరకు డెడ్‌లైన్ విధించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల తొలి విడతలో పార్లమెంట్ దద్దరిల్లేలా ఆందోళనలు నిర్వహించిన టీడీపీ ఎంపీలు.. కొంత వరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విజయవంతమయ్యారు. అప్పటికప్పుడు కొన్ని నిధులు కూడా విడుదల చేసింది. అయితే ప్రత్యేక ప్యాకేజీపై స్పష్టమైన హామీ ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. రెండో విడత సమావేశాలు మొదలయ్యే మార్చి 5లోపు ప్రకటన వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
ఒకవేళ సానుకూల ప్రకటన రాకపోతే.. ఆ రోజు నంచి మోదీ ప్రభుత్వానికి ఒక్కొక్కటిగా షాక్ ఇవ్వాలన్నది బాబు ప్లాన్. అందులో భాగంగా మార్చి 5నే ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. టీడీపీ ముఖ్యనేతల మాటలను బట్టి చూస్తే.. బాబు ఇదే వ్యూహాన్ని అనుసరించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు మంత్రులు కూడా దానికి సై అన్నట్లు సమాచారం. అశోక గజపతి రాజు అయితే.. రాజీనామాపై ముందుగానే తన అనుచరులు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు కేంద్ర మంత్రుల రాజీనామా తర్వాత మెల్లగా ఎంపీల రాజీనామాకు కూడా తెరతీసే అవకాశం ఉంది. ఈ ఒక్క దెబ్బతో ఇటు ప్రతిపక్ష వైసీపీ, అటు బీజేపీకి షాకివ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఏప్రిల్ 6న రాజీనామాలంటూ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించిన వైసీపీకి ఇది మింగుడుపడనిదే. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో చూడాలని బీజేపీని హెచ్చరించిన బాబు.. ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణకు దిగితే మోదీకి చుక్కలు కనపించడం ఖాయం.