అమరావతి రాజధానికి మద్దతు కూడగట్టే విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి ఈగోలకు పోవడం లేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను.. అమరావతి ఉద్యమంలో.. నేరుగా భాగస్వామ్యం చేసేందుకు.. ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని చంద్రబాబు తిప్పికొడుతున్నారు. అదే సమయంలో.. పవన్ నైజాన్ని పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ పోరాటాలు చేసి పైకి వచ్చిన వ్యక్తి అని చంద్రబాబు మచిలీపట్నంలో ప్రశంసలు కురిపించారు. వైసీపీ నేతలు దోపిడీలు చేసి వచ్చారని… అలాంటి వాళ్లంతా పవన్ ను అంటున్నారని మండిపడ్డారు. పవన్ నాయుడు అంటున్న వైసీపీ నేతతలు… కొడాలి నానిరెడ్డా అని ప్రశ్నించారు. మచిలీపట్నంలోనే కాదు.. చంద్రబాబు.. ఎక్కడ మాట్లాడినా.. పవన్ కు మాట సాయం చేస్తున్నారు. ఆయన పోరాటానికి మద్దతిస్తున్నారు.
అమరావతి తరలిపోతే.. ఏపీకి తీవ్ర నష్టమని భావిస్తున్న టీడీపీ అధినేత.. రాజకీయ కారణాలతో ఏ ఒక్కరినీ దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు. కమ్యూనిస్టు పార్టీల్ని ఇతర.. ప్రజా సంఘాలకే పెద్ద బాధ్యత ఇచ్చి.. వారి నాయకత్వంలోనే.. తాను కూడా నడుస్తున్నారు. అమరావతి జేఏసీ బస్సు యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో.. తానే రంగంలోకి దిగారు. రోజువారీ ఉద్యమ కార్యాచరణకు.. సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ మద్దతు కూడా అందితే.. పోరాటం ఓ రేంజ్లో ఉండే అవకాశం ఉంటుంది. అందుకే.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారని అనుకోవచ్చు.
నిజానికి ఎన్నికల ముందు నుంచీ.. టీడీపీ పవన్ కల్యాణ్‌పై సానుకూలంగానే ఉంది. కలసి పని చేయడానికి రావాలని ఎన్నికలకు ముందు చంద్రబాబు..పవన్ కల్యాణ్‌కు పిలుపునిచ్చారు. నాలుగేళ్ల వరకూ.. పవన్ కల్యాణ్‌కు.. టీడీపీ ప్రభుత్వంలో మంచి ప్రయారిటీ లభించింది. ఆయన లేవనెత్తిన సమస్యలన్నింటినీ పరిష్కరించారు. ఉద్దానం విషయంలో.. పవన్ కల్యాణ్‌కు మంచి పేరు రావడానికి చంద్రబాబు ఎలాంటి శషభిషలు పెట్టుకోకుండా.. పవన్ అడిగినవన్నీ చేయడమే కారణం. ఇప్పటి ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి పవన్ కల్యాణ్‌కు కూడా తేడా తెలిసి వచ్చింది. కొద్ది రోజుల కిందట.. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించిందని.. ఇప్పటి ప్రభుత్వానికి అది లేదని.. పవన్ నేరుగానే చెప్పారు. టీడీపీతో కాకపోయినా.. అమరావతి జేఏసీతో అయినా జనసేన కలిసి పోరాటం చేస్తే.. వచ్చే కిక్ వేరుగా ఉంటుంది.